1,500 ఎకరాల్లో ఏరోసిటీ ప్రాజెక్టులు
ABN , Publish Date - Sep 15 , 2024 | 01:52 AM
ఢిల్లీ, హైదరాబాద్, గోవా విమానాశ్రయాలను నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్.. పెద్దఎత్తున రియల్టీ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ మూడు విమానాశ్రయాల్లో దాదాపు 1,500 ఎకరాల్లో ఏరోసిటీ ప్రాజెక్టులు...
ఢిల్లీ, హైదరాబాద్, గోవా విమానాశ్రయాల్లో అభివృద్ధి
జీఎంఆర్ గ్రూప్ సన్నాహాలు
ఢిల్లీ, హైదరాబాద్, గోవా విమానాశ్రయాలను నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్.. పెద్దఎత్తున రియల్టీ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ మూడు విమానాశ్రయాల్లో దాదాపు 1,500 ఎకరాల్లో ఏరోసిటీ ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ ఏరోసిటీ ప్రాజెక్టుల్లో ఇండస్ట్రియల్, కమర్షియల్, హాస్పిటాలిటీ సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. ఢిల్లీ విమానాశ్రయంలో హోటల్స్, హాస్పిటల్స్, ఆఫీస్ స్పేస్‌తో పాటు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీనియర్ లివింగ్, కో-లివింగ్ సదుపాయాలు సహా కార్యాలయ స్థలాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు గోవా విమానాశ్రయంలో రిటైల్ డిస్ట్రిక్ట్, హోటల్స్, గోల్ఫ్ కోర్స్‌తో పాటు విల్లాలను నిర్మించాలని చూస్తోంది. అయితే హైదరాబాద్ విమానాశ్రయంలో తొలుత పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించాలని జీఎంఆర్ గ్రూప్ భావిస్తోంది. కాగా విమానాశ్రయాల్లో సమీకృత కమర్షియల్ ప్రాజెక్టులను ఏరోసిటీ బ్రాండ్ కింద జీఎంఆర్ గ్రూప్ అభివృద్ధి చేస్తోంది.
ఢిల్లీ ఏరోసిటీ.. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్‌గా ఉంది. ఢిల్లీ ఏరోసిటీని అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో జీఎంఆర్ గ్రూప్ పలు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. జీఎంఆర్‌తో పాటు భారతి రియల్టీ, ప్రెస్టీజ్ గ్రూప్ కూడా విమానాశ్రయాల్లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్, రిటైల్, హోటల్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.
హైదరాబాద్‌కు ఆర్థిక చోదకశక్తిగా..
కాగా హైదరాబాద్ విమానాశ్రయంలో తొలి దశలో అభివృద్ధి చేస్తున్న ఏరోసిటీ ప్రాజెక్ట్.. ఉద్యోగాల కల్పన, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ఏరోసిటీలో ఏవియేషన్, ఇండస్ట్రియల్ సెజ్‌లను అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 50,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించటమే కాకుండా హైదరాబాద్ ఆర్థికాభివృద్ధికి కీలకంగా ఉంటుందని జీఎంఆర్ గ్రూప్ అంచనాగా ఉంది. మరోవైపు ఈ విమానాశ్రయంలో స్కూల్స్, యూనివర్సిటీ క్యాంప్‌సలు, హోటల్స్‌ను మరింతగా విస్తరించాలని భావిస్తోంది. ఇదే సమయంలో వాణిజ్య, ఐటీ పార్కులు, హెల్త్‌కేర్ ప్రాజెక్ట్స్‌ను కూడా డెవలప్ చేయాలని చూస్తోంది.