అక్కడ ఇక్కడ వార్.. బేర్‌ర్..!
ABN , Publish Date - Oct 04 , 2024 | 02:15 AM
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌నూ కుదిపేశాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చవచ్చన్న ఆందోళనలతో ఈక్విటీ ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. ఇందుకుతోడు...
కుప్పకూలిన మార్కెట్ సూచీలు
సెన్సెక్స్ 1,769 పాయింట్లు డౌన్
25,250 స్థాయికి నిఫ్టీ
చిన్న కంపెనీల షేర్లూ విలవిల
రూ.10 లక్షల కోట్ల సంపద ఫట్
విదేశీ ఇన్వెస్టర్లూ చైనాకు జంప్
ముడి చమురు మళ్లీ భగ భగ
14 నుంచి హ్యుండయ్ రూ.25,000 కోట్ల ఐపీఓ
ముంబై: పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌నూ కుదిపేశాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చవచ్చన్న ఆందోళనలతో ఈక్విటీ ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. ఇందుకుతోడు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మన మార్కెట్లోని పెట్టుబడులను పెద్దఎత్తున చైనాకు మళ్లిస్తుండటం, ముడిచమురు ధరలు మళ్లీ ఎగబాకడం, ఎఫ్ అండ్ ఓ నిబంధనలను సెబీ కఠినతరం చేయడం ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మరింత కుంగదీశాయి.
దాంతో మదుపరులు ఆయిల్, బ్యాంకింగ్, వాహన రంగ షేర్లలో భారీ గా అమ్మకాలు జరపడంతో ప్రామాణిక సూచీలు కుప్పకూలాయి. గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి, సెన్సెక్స్ ఏకంగా 1,769.19 పాయింట్లు (2.10 శాతం) పతనమై మూడు వారాల (సెప్టెంబరు 11) కనిష్ఠ ముగింపు స్థాయి 82,497.10 వద్దకు జారుకుంది. నిఫ్టీ సైతం 546.80 పాయింట్లు (2.12 శాతం) క్షీణించి 25,250.10 వద్ద క్లోజైంది. సూచీలకు గడిచిన 2 నెలల్లో ఇదే అతిపెద్ద పతనం.
అంతేకాదు, సూచీలు నష్టపోవడం వరుసగా ఇది నాలుగో రోజు. మార్కెట్లోని ప్రధాన కంపెనీలతోపాటు చిన్న, మధ్య స్థాయి సంస్థల షేర్లలోనూ అమ్మకాలు పోటెత్తాయి. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 2.27 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.84 శాతం క్షీణించాయి. యుద్ధ భయాలతో మార్కెట్ బేర్‌మనడంతో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజే రూ.9.78 లక్షల కోట్లు తగ్గి రూ.465.07 లక్షల కోట్లకు (5.54 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ కంపెనీల్లో జేఎ్‌సడబ్ల్యూ స్టీల్ మినహా అన్నీ నష్టపోయాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్ మళ్లీ కొండెక్కుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ రకం ముడి చమురు పీపా ధర ఒక దశలో 1.66 శాతం పెరుగుదలతో 75.13 డాలర్ల వద్దకు చేరింది.
దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుండయ్‌కి భారత అనుబంధ విభాగమైన హ్యుండయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ రూ.25,000 కోట్ల మెగా ఐపీఓ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐపీఓలో భాగంగా హ్యుండయ్ తన మాతృసంస్థ వాటాకు చెందిన 14,21,94,700 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిన విక్రయించనుంది. దేశంలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది.
సెన్సెక్స్ 50, బ్యాంకెక్స్ వీక్లీ కాంట్రాక్టులకు స్వస్తి
సెన్సెక్స్ 50, బ్యాంకెక్స్ వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్ కాంట్రాక్టులను నిలిపివేయనున్నట్లు బీఎ్‌సఈ ప్రకటించింది. వచ్చే నెల 14 నుంచి సెన్సెక్స్ 50 ఇండెక్స్ కాంట్రాక్టులకు, 18 నుంచి బ్యాంకెక్స్ కాంట్రాక్టులను నిలిపివేయనున్నట్లు గురువారం విడుదల చేసిన సర్క్యులర్‌లో బీఎస్‌ఈ స్పష్టం చేసింది. క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజా ఆదేశాలకు అనుగుణంగా స్టాక్ ఎక్స్ఛేంజీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్స్ అండ్ అప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను కట్టడి చేసేందుకు సెబీ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఎక్స్ఛేంజీలు ఒక ఇండెక్స్‌లో మాత్రమే వీక్లీ డెరివేటివ్ కాంట్రాక్టులను ఆఫర్ చేసేందుకు అనుమతించనున్నట్లు సెబీ స్పష్టం చేసింది. కాంట్రాక్టుల ముగింపు తేదీన స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను నిరోధించడంతో పాటు మార్కెట్లో ఊగిసలాటలను తగ్గించేందుకు నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుంది.
కేఆర్‌ఎన్ బంపర్ లిస్టింగ్
మార్కెట్ భారీగా నష్టపోయినప్పటికీ, కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ లిస్టింగ్ మాత్రం దుమ్మురేపింది. ఐపీఓ ధర రూ.220తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు ఏకంగా 113.63 శాతం ప్రీమియంతో రూ.470 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 125.90 శాతం ఎగబాకినప్పటికీ, తొలిరోజు ట్రేడింగ్ ముగిసేసరికి షేరు 117.48 శాతం లాభంతో రూ.478.45 వద్ద స్థిరపడింది.