Share News

ఏథర్‌ ఎనర్జీతో అమరరాజా ఒప్పందం

ABN , Publish Date - Aug 02 , 2024 | 02:33 AM

అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ (ఏఆర్‌ఈఎం) పూర్తి యాజమాన్య కంపెనీ అయిన అమరరాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ (ఏఆర్‌ఏసీటీ) ఏథర్‌ ఎనర్జీతో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది...

ఏథర్‌ ఎనర్జీతో అమరరాజా ఒప్పందం

బెంగళూరు: అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ (ఏఆర్‌ఈఎం) పూర్తి యాజమాన్య కంపెనీ అయిన అమరరాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ (ఏఆర్‌ఏసీటీ) ఏథర్‌ ఎనర్జీతో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందం కింద తెలంగాణలోని దివిటిపల్లిలో రానున్న తమ గిగా ఫ్యాక్టరీలో ఎన్‌ఎంసీ (నికెల్‌ మాంగనీస్‌ కోబాల్ట్‌), ఎల్‌ఎ్‌ఫపీ (లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌), లిథియం అయాన్‌ (లై-అయాన్‌) వంటి ఆధునిక రసాయనిక బ్యాటరీలు ఉత్పత్తి చేయడంలో ఉభయ సంస్థలు సహకరించుకుంటాయి. భారతదేశం స్వచ్ఛ, హరిత ఇంధనాల వినియోగానికి మారుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్‌ పరిశ్రమ విద్యుత్‌ వాహనాలు ప్రత్యేకించి విద్యుత్‌ టూవీలర్ల తయారీపై దృష్టి సారించింది. 2030 నాటికి విద్యుత్‌ టూవీలర్ల పరిశ్రమ 40 శాతం విస్తరిస్తుందని అంచనా. పెరుగుతున్న మార్కెట్‌ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అమరరాజా, ఏథర్‌ ఆశావహ ప్రణాళికలు రూపొందించుకున్న నేపథ్యంలో ఈ ఒప్పందం ఉభయ సంస్థలకు కీలకం కానుంది. ఏథర్‌ ఎనర్జీకి కర్ణాటకలోని హోసూరు, తమిళనాడుల్లో రెండు తయారీ ప్లాంట్లు పని చేస్తున్నాయి. మహారాష్ట్రలో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించింది.


అమరరాజా కూడా ఇ-మొబిలిటీ రంగానికి అవసరం అయిన ఉత్పత్తులు, సొల్యూషన్లు అందించేందుకు కట్టుబడి ఉంది. ఇదిలా ఉండగా లిథియం అయాన్‌ సెల్స్‌ను భారతదేశంలోని పరిస్థితులకు అనుగుణంగా తయారుచేసేందుకు వీలుగా ఎల్‌ఎ్‌ఫపీ టెక్నాలజీని లోకలైజ్‌ చేసేందుకు జీఐబీతో అమరరాజా ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. జీఐబీతో తాము ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు తాజాగా ఏథర్‌ ఎనర్జీతో కుదుర్చుకున్నర ఒప్పందం వల్ల ఈవీ మార్కెట్‌కు అవసరమైన సొల్యూషన్లు అందించేందుకు తాము చేస్తున్న కృషికి మరింత బలం చేకూరుతుందని ఏఆర్‌ఈఎం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్య గౌరినేని అన్నారు.

Updated Date - Aug 02 , 2024 | 02:33 AM