హ్యుండయ్ కార్లకు అమరాన్ ఏజీఎం బ్యాటరీలు
ABN , Publish Date - Dec 20 , 2024 | 02:33 AM
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండయ్ మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్) కూడా ఆత్మనిర్భర భారత్ బాట పట్టింది. ఇందులో భాగంగా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండయ్ మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్) కూడా ఆత్మనిర్భర భారత్ బాట పట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నుంచి తన కార్లలో అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ (ఏఆర్‌ఈ అండ్ ఎం) అభివృద్ధి చేసిన అబ్సార్బెంట్ గ్లాస్ మ్యాట్ (ఏజీఎం) బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఏజీఎం బ్యాటరీ టెక్నాలజీని దేశంలోని ఒక కార్ల కంపెనీ ఉపయోగించడం ఇదే మొదటిసారి. సంప్రదాయ కంప్లీట్ మెయింటెన్స్ ఫ్రీ (సీఎంఎఫ్) బ్యాటరీలతో పోలిస్తే ఏజీఎం బ్యాటరీల పనితీరు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ 150 శాతం ఎక్కువగా ఉండడంతో హ్యుండయ్ మోటార్స్ ఈ నిర్ణయం తీసుకుంది. బీఎస్6 ఫేజ్ 2 ప్రామాణికాలకు అనుగుణంగా తమ ఏజీఎం బ్యాటరీలను అభివృద్ధి చేసినట్టు అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ఈడీ హర్షవర్థన గౌరినేని తెలిపారు.