Share News

అంబానీ, అదానీ ఆస్తులకు బీటలు

ABN , Publish Date - Dec 17 , 2024 | 01:14 AM

దేశంలోనే అత్యంత సంపన్నులైన ముకేశ్‌ అంబానీ, గౌతం అదానీల సంపద పరుగుకు బ్రేక్‌ పడింది. ఈ ఏడాది జూన్‌లో 24,310 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.20,63,675 కోట్లు) ఉన్న వీరిరువురి సంపద....

అంబానీ, అదానీ ఆస్తులకు బీటలు

100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌ నుంచి ఔట్‌

న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత సంపన్నులైన ముకేశ్‌ అంబానీ, గౌతం అదానీల సంపద పరుగుకు బ్రేక్‌ పడింది. ఈ ఏడాది జూన్‌లో 24,310 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.20,63,675 కోట్లు) ఉన్న వీరిరువురి సంపద ఈ నెల 13వ తేదీ నాటికి 17,880 కోట్ల డాలర్లకు (సుమారు రూ.15,17,833 కోట్లు) పడిపోయింది. దీంతో వీరిద్దరికి ఈ సంవత్సరం బ్లూమ్‌బర్గ్‌ 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చోటు దొరకలేదు. ఈ ఏడాది జూన్‌ నుంచి ఈ నెల 13వ తేదీ మధ్య వీరిద్దరి సంపద రూ.5.45 లక్షల కోట్లు ఆవిరైపోయింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపద 12,080 కోట్ల డాలర్ల నుంచి 9,670 కోట్ల డాలర్లకు (సుమారు రూ.8.21 లక్షల కోట్లు), ఆదానీ సంపద 12,230 కోట్ల డాలర్ల నుంచి 8,210 కోట్ల డాలర్లకు (సుమారు రూ.6.96 లక్షల కోట్లు) పడిపోయింది.


ఆర్‌ఐల్‌ ఎనర్జీ, రిటైల్‌ వ్యాపారాల వృద్ధిరేటు తగ్గడం, అప్పులు పెరిగి పోవడం అంబానీ ఆస్తులను దెబ్బతీసింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ రాజకీయనేతలు, అధికారులకు లంచాలు మేపిందన్న ఆరోపణలతో అమెరికాలో గౌతం అదానీపై కేసులు నమోదు కావదం ఆయన ఆస్తులు క్షీణించడానికి కారణమని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది.

20 మంది మరింత పైకి: అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 20 మంది సంపన్న భారతీయుల సంపద మాత్రం 6,730 కోట్ల డాలర్లు (5.71 లక్షల కోట్లు) పెరిగినట్టు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. మళ్లీ ఇందులో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధినేత శివ నాడార్‌ సంపద 1,080 కోట్ల డాలర్లు (సుమారు రూ.91,681 కోట్లు), ఓపీ జిందాల్‌ గ్రూపు గౌరవ చైర్‌పర్సన్‌ సావిత్రి జిందాల్‌ ఆస్తులు 1,010 కోట్ల డాలర్లు (సుమారు రూ.85,738 కోట్లు) పెరిగాయి.

Updated Date - Dec 17 , 2024 | 01:14 AM