2030 నాటికి అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలు అవసరం
ABN , Publish Date - Aug 18 , 2024 | 01:21 AM
ఉద్యోగాల కల్పన విషయంలో భారత్ జీ-20 సభ్య దేశాలన్నింటికంటే వెనకబడిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అన్నారు. దేశ జనాభా వృద్ధి దృష్ట్యా...
ఉపాధి కల్పనలో భారత్ వెనుకబడింది.. మరిన్ని కీలక సంస్కరణలు చేపట్టాలి
విద్యా వ్యవస్థను పునరుద్ధరించాలి..
ప్రైవేట్ పెట్టుబడులు మరింత పెరగాలి..
పన్నుల పరిధిని విస్తృతం చేయాలి..
ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్
న్యూఢిల్లీ: ఉద్యోగాల కల్పన విషయంలో భారత్ జీ-20 సభ్య దేశాలన్నింటికంటే వెనకబడిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అన్నారు. దేశ జనాభా వృద్ధి దృష్ట్యా, 2030 నాటికి 14.8 కోట్ల అదనపు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో శనివారం నిర్వహించిన డైమండ్ జూబ్లీ ఉత్సవాల కార్యక్రమంలో గీతా గోపీనాఽథ్ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆమె ప్రస్తావించిన మరిన్ని ముఖ్యాంశాలు..
2010తో ప్రారంభమైన దశాబ్దంలో భారత్ సగటున 6.6 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేయగా.. ఈ కాలానికి ఉద్యోగాల కల్పన రేటు మాత్రం 2 శాతానికి పరిమితమైంది. జీ 20లోని ఇతర దేశాలతో పోలిస్తే భారత ఉద్యోగాల కల్పన చాలా తక్కువగా ఉంది.
జనాభా వృద్ధికి సంబంధించి భారత అంచనాలను బట్టి చూస్తే, 2030 నాటికి అదనంగా 6 కోట్ల నుంచి 14.8 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 2024 సంవత్సరంలో ఉన్నాం. కాబట్టి, వచ్చే ఆరేళ్లలో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరపాల్సి ఉంది.
భారీ స్థాయిలో ఉద్యోగాలు సృష్టించేందుకు భూ సంస్కరణలు, కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాల్సి ఉంటుంది. దేశంలో ప్రైవేట్ పెట్టుబడులూ ప్రస్తుత 7 శాతం వృద్ధికి అనుగుణంగా లేవు. కాబట్టి, ప్రైవేట్ ఇన్వె్‌స్టమెంట్లను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మాత్రం మౌలికాభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది.
దేశ కార్మికశక్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు విద్యా వ్యవస్థను పునరుద్ధరించాలి. అలాగే, దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరంగా మార్చడంతో పాటు నియంత్రణ వ్యవస్థలను మెరుగుపర్చాలి. పన్నుల పరిధిని విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుత గరిష్ఠ వృద్ధి పథకంలో నిలకడగా కొనసాగడంతో పాటు కోట్లలో ఉద్యోగాల కల్పనకు మరిన్ని కీలక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ సరుకు రవాణా వ్యవస్థలో భారత్ కీలకంగా మారాలంటే దిగుమతి సుంకాలను తగ్గించాల్సి ఉంటుంది.
పన్ను విషయంలో భారత్ కూడా ఇతర వర్ధమాన దేశాల స్థాయిలోనే ఉంది. ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరుతోంది. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిధిని మరింత విస్తృతం చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని వర్ధమాన దేశాలకు సూచిస్తున్నాం.
పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు జీఎ్‌సటీ రేట్లను మరింత హేతుబద్దీకరించడంతో పాటు నిబంధనలను సరళీకరించాల్సిన అవసరం ఉంది. తద్వారా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని మరో 1.5 శాతం మేర పెంచుకునే అవకాశం ఉంటుంది.
గీతా గోపీనాథ్ శనివారం సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఎంఎ్‌ఫతో మరింతగా భాగస్వామ్యమయ్యేందుకు మరిన్ని మార్గాలను అన్వేషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా అన్నారు. ఆర్థిక స్థిరీకరణ లక్ష్యాల సాధనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విధానపరమైన చర్యలు కొనసాగిస్తున్నందుకు సీతారామన్‌ను గోపీనాథ్ అభినంధించారు.