ఇక ఇళ్ల ధరల పెరుగుదల అంతంతే
ABN , Publish Date - May 23 , 2024 | 06:12 AM
దేశంలో ఇళ్ల ధరల పెరుగుదల స్వల్పకాలిక, మధ్యకాలిక ధోరణిలో నామమాత్రంగానే ఉంటుందని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఇండియా హెడ్ అన్షుల్ జైన్ అన్నారు. కొవిడ్ అనంతరం గత రెండేళ్ల కాలంలో...
ఇప్పటికే చుక్కలనంటాయి
కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ హెడ్ అన్షుల్ జైన్
న్యూఢిల్లీ: దేశంలో ఇళ్ల ధరల పెరుగుదల స్వల్పకాలిక, మధ్యకాలిక ధోరణిలో నామమాత్రంగానే ఉంటుందని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఇండియా హెడ్ అన్షుల్ జైన్ అన్నారు. కొవిడ్ అనంతరం గత రెండేళ్ల కాలంలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయని, ఈ కారణంగా కొంత కాలం పాటు ధరల్లో స్తబ్ధత ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం ప్రస్తుతం అత్యధిక ఆర్థిక వృద్ధి సాధిస్తూ ఉండడంతో పాటు ప్రజల్లో ప్రత్యేకించి యువతరంలో సొంత ఇల్లు కలిగి ఉండాలనే ఆకాంక్ష బలంగా ఉన్నందు వల్ల భవిష్యత్తులో ఇళ్ల డిమాండు బలంగానే ఉంటుందని ఆయన తెలిపారు. 2013-14 నుంచి 2019 వరకు దేశంలో ఇళ్ల డిమాండు స్తబ్ధంగానే ఉన్నదని, ఆ సమయంలో యువత సొంతం గా ఏదైనా కలిగి ఉండాలని ఆకాంక్షించలేదని ఆయన చెప్పారు. కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చిందంటూ సొంత ఇల్లు కలిగి ఉండడం వల్ల స్థిరత్వం ఉంటుందనే భావం నెలకొన్నట్టు ఆయన తెలిపారు. మారిన పరిస్థితుల కారణంగా ప్రజలు పెద్ద ఇళ్లు కావాలని కోరుకున్నారని, దేశంలో కనిష్ఠంగా ఉన్న వడ్డీరేట్లు కూడా ఇళ్ల కొనుగోలుదారులకు ప్రోత్సాహకమైన అంశమని జైన్ అన్నారు. దీంతో డి మాండు గణనీయంగా పెరిగి ధరలు కూడా దూసుకుపోయాయని తెలిపారు.
ధరల పెరుగుదల తీరును చూసి ఇన్వెస్టర్లు కూడా గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ముందుకు రావడం మార్కెట్‌ను ఉత్తేజితం చేసిందని వివరించారు. ఆ తీరులో గత రెండేళ్లుగా ఇళ్ల ధరలు దూసుకుపోయిన కారణంగా ఒకటి, రెండు సంవత్సరాల కాలం పాటు ధరల్లో స్థిరీకరణ ఏర్పడవచ్చునన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు. వచ్చే రెండేళ్లలో ధరల్లో రెండంకెల వృద్ధి ఉండకపోవచ్చునని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలో ఇళ్ల మార్కెట్ ధోరణులను పరిశీలించే వివిధ కన్సల్టెన్సీ సంస్థల అధ్యయనం ప్రకారం ఎనిమిది ప్రధాన నగరాల్లో కొవిడ్ అనంతరం ధరలు సగటున 10 శాతం పెరిగాయి. అయితే కొన్ని చిన్న మార్కెట్లలో మాత్రం ధరలు 40 నుంచి 70 శాతం వరకు కూడా పెరిగాయి. పైగా మంచి పేరు ప్రఖ్యాతులున్న బిల్డర్ల ప్రాజెక్టులకే ప్రజలు మొగ్గు చూపడం ప్రారంభించారు.