Share News

తగ్గిన ధరల కాక

ABN , Publish Date - Dec 13 , 2024 | 02:42 AM

దేశంలో ధరల మంట కాస్తంత ఉపశమించింది. అక్టోబరులో 6.21 శాతానికి దూసుకుపోయి అటు ప్రభుత్వంలోను, ఇటు ప్రజల్లోను అలజడి రేకెత్తించిన రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబరు నెలలో 5.48 శాతానికి దిగి వచ్చింది. ఆహార వస్తువుల ధరల్లో...

తగ్గిన ధరల కాక

నవంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.48 శాతం

న్యూఢిల్లీ: దేశంలో ధరల మంట కాస్తంత ఉపశమించింది. అక్టోబరులో 6.21 శాతానికి దూసుకుపోయి అటు ప్రభుత్వంలోను, ఇటు ప్రజల్లోను అలజడి రేకెత్తించిన రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబరు నెలలో 5.48 శాతానికి దిగి వచ్చింది. ఆహార వస్తువుల ధరల్లో తగ్గుదల ఇందుకు దోహదపడినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆహార వస్తువుల ధరల విభాగంలో ద్రవ్యోల్బణం అక్టోబరుతో పోల్చితే 10.87 శాతం నుంచి 9.04 శాతానికి తగ్గింది. గత ఏడాది నవంబరులో ఇది 8.70 శాతంగా ఉంది. నవంబరు నెలలో కూరగాయలు, పప్పులు, పప్పు ఉత్పత్తులు, చక్కెర, కన్ఫెక్షనరీ, పళ్లు, పాలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, రవాణా, కమ్యూనికేషన్‌, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయని ఎన్‌ఎ్‌సఓ తెలిపింది. జూలై, ఆగస్టు నెలల్లో సగటున 3.6 శాతం ఉన్న వినియోగ వస్తువుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 5.5 శాతానికి, అక్టోబరులో 6.2 శాతానికి దూసుకుపోయిన విషయం విదితమే.


తాజా పరిస్థితిని పరిశీలనలోకి తీసుకున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచింది. ఆహార ధరల ఒత్తిడి కారణంగా డిసెంబరు త్రైమాసికంలో కూడా ద్రవ్యోల్బణం అధికంగానే ఉండవచ్చని కూడా పేర్కొంది.

మందగించిన పారిశ్రామికం

మైనింగ్‌, విద్యుత్‌, తయారీ రంగాలు మందగించడంతో అక్టోబరు నెలలో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు 3.5 శాతానికి పరిమితమైంది. గత ఏడాది అక్టోబరులో వృద్ధి రేటు 11.9 శాతంతో పోల్చితే పారిశ్రామిక వృద్ధి గణనీయంగా తగ్గినా సెప్టెంబరులో నమోదైన 3.1 శాతంతో పోల్చితే మాత్రం మెరుగుపడినట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.


ఏప్రిల్‌-అక్టోబరు నెలల మధ్య కాలంలో కూడా ఐఐపీ వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన 7 శాతం నుంచి 4 శాతానికి క్షీణించింది. అక్టోబరులో గనుల రంగంలో వృద్ధిరేటు 13.1 శాతం నుంచి 0.9 శాతానికి క్షీణించగా తయారీ రంగంలో 10.6 శాతం నుంచి 4.1 శాతానికి, విద్యుత్‌ రంగంలో 20.4 శాతం నుంచి 2 శాతానికి, యంత్ర పరికరాల విభాగంలో 21.7 శాతం నుంచి 3.1 శాతానికి వృద్ధి రేటు పడిపోయింది. వినియోగ ఆధారిత వర్గీకరణ కింద ఉత్పత్తి కన్స్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో కూడా 9.3 శాతం నుంచి 2.7 శాతానికి క్షీణించింది.

Updated Date - Dec 13 , 2024 | 02:42 AM