Share News

కేర్‌ హాస్పిటల్స్‌ చేతికి ఏస్టర్‌ డీఎం హెల్త్‌

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:59 AM

దేశంలో ఆస్పత్రుల రంగంలో మరో భారీ విలీనం చోటు చేసుకుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ హాస్పిటల్‌ చెయిన్‌, బ్లాక్‌స్టోన్‌ నిర్వహణలోని క్వాలిటీ కేర్‌ ఇండియా లిమిటెడ్‌లో (కేర్‌ హాస్పిటల్స్‌) విలీనమవుతోంది.

కేర్‌ హాస్పిటల్స్‌ చేతికి ఏస్టర్‌ డీఎం హెల్త్‌

మూడో అతి పెద్ద హాస్పిటల్‌ చైన్‌గా అవతరణ.. హైదరాబాద్‌లోనే ప్రధాన కార్యాలయం

న్యూఢిల్లీ: దేశంలో ఆస్పత్రుల రంగంలో మరో భారీ విలీనం చోటు చేసుకుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ హాస్పిటల్‌ చెయిన్‌, బ్లాక్‌స్టోన్‌ నిర్వహణలోని క్వాలిటీ కేర్‌ ఇండియా లిమిటెడ్‌లో (కేర్‌ హాస్పిటల్స్‌) విలీనమవుతోంది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. విలీనం తర్వాత కంపెనీ పేరు ఏస్టర్‌ డీఎం క్వాలిటీ కేర్‌ లిమిటెడ్‌గా (ఏడీక్యూసీఎల్‌) మారుస్తారు. కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నట్టు ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ ప్రకటించింది. ఈ విలీనంతో అపోలో, మణిపాల్‌ హాస్పిటల్స్‌ తర్వాత ఏడీక్యూసీఎల్‌ దేశంలో మూడో అతి పెద్ద ఆస్పత్రుల చెయిన్‌గా ఆవిర్భవించనుంది.

ఏస్టర్‌ డీఎందే మెజారిటీ వాటా

ఈ విలీనంతో ఏర్పడే ఏడీక్యూసీఎల్‌ కంపెనీ ఈక్విటీలో ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ వాటాదారులకు 57.3 శాతం వాటా ఉంటుంది. మిగిలిన 42.7 శాతం వాటా క్వాలిటీ కేర్‌ ఇండియా లిమిటెడ్‌ (క్యూసీఐఎల్‌) వాటాదారులకుంటుందని ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ స్టాక్‌ ఎక్స్చేంజిలకు తెలిపింది. విలీన కంపెనీ మొత్తం ఈక్విటీలో ఏస్టర్‌ డీఎం ప్రమోటర్లయిన మూపెన్‌ కుటుంబానికి 24 శాతం, కేర్‌ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్న ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థ బ్లాక్‌స్టోన్‌కు 30.7 శాతం వాటా ఉంటుంది. విలీనం తర్వాత కూడా ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ ప్రధాన ప్రమోటర్‌ ఆజాద్‌ మూపెన్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా, క్వాలిటీ కేర్‌ గ్రూప్‌ ఎండీ వరుణ్‌ ఖన్నా ఎండీ, సీఎఫ్‌ఓగా కొనసాగుతారు.


10,000కు పైగా పడకలు

ఈ విలీనంతో ఏస్టర్‌ డీఎం, కేర్‌ హాస్పిటల్స్‌, కిమ్స్‌ హెల్త్‌, ఎవర్‌కేర్‌ పేర్లతో నడుస్తున్న నాలుగు ప్రధాన హాస్పిటల్‌ చెయిన్స్‌ ఏడీక్యూసీఎల్‌ నిర్వహణలోకి రానున్నాయి. ఈ నాలుగు హాస్పిటల్స్‌కు ప్రస్తుతం దేశంలోని 27 నగరాల్లో 10,150+ పడకలతో కూడిన 38 ఆస్పత్రులున్నాయి. అంతర్గత వనరులతో 2027 మార్చి నాటికి మరో 3,500 పడకలను ఏడీక్యూసీఎల్‌ ఏర్పాటు చేయనుంది.

ఏస్టర్‌ గూటికి ప్రేరణ హాస్పిటల్‌

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ కేంద్రంగా పనిచేసే 254 పడకల ప్రేరణ హాస్పిటల్‌ను, ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ పూర్తిగా కొనుగోలు చేసింది. ఏస్టర్‌ ఆధార్‌ హాస్పిటల్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ హాస్పిటల్‌ ఈక్విటీలో ఏస్టర్‌ డీఎంకు ఇప్పటికే 87 శాతం వాటా ఉంది. మిగిలిన 13 శాతం వాటా కొనుగోలు చేసేందుకు కూడా ఒప్పందం కుదిరినట్టు తెలిపింది.

Updated Date - Nov 30 , 2024 | 05:59 AM