మళ్లీ పతనబాటలోకి ..
ABN , Publish Date - Nov 29 , 2024 | 06:00 AM
భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలు గురువారం భారీ నష్టాలు చవిచూశాయి. మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ సహా ప్రధాన కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటంతో...
సెన్సెక్స్ 1,200 పాయింట్ల నష్టం
మళ్లీ 80,000 దిగువకు సూచీ
నిఫ్టీ 360 పాయింట్లు డౌన్
ముంబై: భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలు గురువారం భారీ నష్టాలు చవిచూశాయి. మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ సహా ప్రధాన కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటంతో సెన్సెక్స్ 80,000, నిఫ్టీ 24,000 స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్ ఒక దశలో 1,315.16 పాయింట్లు (1.63 శాతం) క్షీణించి 78,918.92 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 1,190.34 పాయింట్ల (1.48 శాతం) నష్టంతో 79,043.74 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 360.75 పాయింట్లు (1.49 శాతం) పతనమై 23,914.15 వద్ద ముగిసింది. మార్కెట్ వర్గాల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.50 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ.442.98 లక్షల కోట్లకు (5.24 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో ఎస్‌బీఐ మినహా అన్నీ నేలచూపు చూశాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 3.48 శాతం, ఇన్ఫోసిస్ 3.46 శాతం నష్టంతో సూచీ టాప్ లూజర్లుగా మిగిలాయి. బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు 2 శాతానికి పైగా క్షీణించగా.. ఇండెక్స్‌లో అత్యధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.67 శాతం, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ ఒక శాతం తగ్గాయి.
అదానీ స్టాక్స్ విషయానికొస్తే, గ్రూప్‌లోని 11 లిస్టెడ్ కంపెనీల్లో 5 లాభపడ్డాయి. అదానీ టోటల్ గ్యాస్ 16 శాతం ఎగబాకగా.. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 10 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం, అదానీ పవర్ 6.95 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.63 శాతం పుంజుకున్నాయి. అదానీ పోర్ట్స్ మాత్రం 2.73 శాతం నష్టపోగా.. ఎన్‌డీటీవీ 2.03 శాతం, ఏసీసీ 0.75 శాతం, అంబుజా సిమెంట్స్ 0.48 శాతం, అదానీ విల్మార్ 0.44 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ 0.17 శాతం తగ్గాయి.