Diwali 2024: కన్ఫ్యూజ్ అవకండి.. దీపావళి సందర్భంగా బ్యాంక్ హాలిడే ఎప్పుడంటే..
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:49 PM
దీపావళి పర్వదినాన దేశవ్యాప్తంగా బ్యాంక్ హాలిడే ఒకటే రోజున ఉండదు. రాష్ట్రాలను బట్టి మారుతుంది. అయితే బ్యాంక్ హాలిడే ఏ రోజున ఉంటుందో తెలిస్తే కీలకమైన లావాదేవీలు నిర్వహించాల్సిన సాధారణ పౌరులు, కంపెనీలు, ఇతర వర్గాలవారు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ ఏడాది ఎప్పుడంటే..
వైవిధ్యమైన సాంస్కృతిక, సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో దీపావళి పండగకు వివిధ ప్రాంతాల్లో విశేష ప్రాధాన్యత, విభిన్న రీతుల్లో వేడుకలు జరుగుతాయి. అందుకే దీపావళి పర్వదినాన దేశవ్యాప్తంగా బ్యాంక్ హాలిడే ఒకటే రోజున ఉండదు. రాష్ట్రాలను బట్టి మారుతుంది. అయితే బ్యాంక్ హాలిడే ఏ రోజున ఉంటుందో తెలిస్తే ముఖ్యమైన లావాదేవీలు నిర్వహించాల్సిన సాధారణ పౌరులు, కంపెనీలు, ఇతర వర్గాలవారు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. తదనుగుణంగా ప్రణాళికల్లో మార్చులు చేసుకునేందుకు వీలుంటుంది. అయితే ఈ ఏడాది దీపావళి పండగ అక్టోబర్ 31నా? లేక నవంబర్ 1నా? అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. దీపావళితో ముడిపడిన బ్యాంక్ హాలిడే విషయంలో కూడా ఈ గందరగోళం కొనసాగుతోంది.
ఏపీ, తెలంగాణలో బ్యాంక్ హాలిడే ఎప్పుడంటే..
ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 31న (గురువారం) పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు దీపావళి సెలవు ఉంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రాల్లోని బ్యాంకులు గురువారం మూసి ఉంటాయి.
ఇక నవంబర్ 1న (శుక్రవారం) మరికొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు దీపావళి సెలవు ఉంది. దీపావళి, కుత్ ఫెస్టివల్, కన్నడ రాజ్యోత్సవాల సందర్భంగా త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాలలో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఇక నవంబర్ 2న దీపావళి (బలి ప్రతిపద), బలిపాడ్యమి/లక్ష్మీ పూజ, గోవర్ధన్ పూజ, విక్రమ్ సంవంత్ ఇలా వేర్వేరు విశేష పూజల కారణంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలోని బ్యాంకులు మూసి ఉంటాయి. దీపావళితో పాటు రాష్ట్రంలోని ప్రత్యేక పండగల కారణంగా కర్ణాటక, మహారాష్ట్రలో బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఈ రాష్ట్రాల్లో అక్టోబరు 31 నుంచి నవంబర్ 3 వరకు బ్యాంకుల సేవలు అందుబాటులో ఉండవు.