మార్కెట్ అవకతవకలపై జాగ్రత్త
ABN , Publish Date - Feb 25 , 2024 | 02:24 AM
క్యాపిటల్ మార్కెట్లో అవకతవకలపై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ శాశ్వత సభ్యుడు కమలేశ్ చంద్ర హెచ్చరించారు. బ్రోకర్లు వీటిపై సదా కన్నేసి ఉంచాలని, ఆ తరహా ఉదంతాలను...
బ్రోకర్లను హెచ్చరించిన సెబీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్లో అవకతవకలపై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ శాశ్వత సభ్యుడు కమలేశ్ చంద్ర హెచ్చరించారు. బ్రోకర్లు వీటిపై సదా కన్నేసి ఉంచాలని, ఆ తరహా ఉదంతాలను నిరోధించాలని ఆయన సూచించారు. మార్కెట్లో నేరాలకు పాల్పడిన వారిపై సెబీ కఠిన చర్యలు చేపడుతున్నదన్నారు. మదుపరులు విశ్వాసం కోల్పోతే మార్కెట్ మొత్తం విఫలమవుతుందన్నారు. ఇప్పటికీ మార్కెట్లో మోసా లు జరుగుతున్నాయని, అన్నింటిలోనూ నియంత్రణ మండలి కలుగజేసుకోలేదన్నారు. కొందరు బ్రోకర్లు మార్కెట్లో మోసాలకు పాల్పడుతున్నారు, మీ సంఘమే ఈ ఉదంతాలపై కన్నేసి ఉంచాలన్నారు. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్‌ఎంఐ) నిర్వహించిన 13 అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏఐ సాయంతో దర్యాప్తు
సెబీ తన దర్యాప్తులతో పాటు చాలా అంశాల్లో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకుంటున్నదని కమలేశ్ చంద్ర తెలిపారు. వ్యాపార అభివృద్ధి, నిర్వహణ దక్షతను పెంచుకునే విషయంలో ఆధునిక సాంకేతిక వినియోగంపై దృష్టిసారించాలని ఆయన ఈ సందర్భంగా బ్రోకర్లకు సూచించారు.