Share News

తెలంగాణ ఉద్యమం నుంచి బీజేపీని వేరు చేయలేరు!

ABN , Publish Date - Jun 19 , 2024 | 05:29 AM

అరవై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినది తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమ చరిత్ర. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమానికి, వర్తమాన కాలంలో మన కళ్ల ముందు సాగిన మలి దశ...

తెలంగాణ ఉద్యమం నుంచి  బీజేపీని వేరు చేయలేరు!

అరవై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినది తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమ చరిత్ర. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమానికి, వర్తమాన కాలంలో మన కళ్ల ముందు సాగిన మలి దశ రాష్ట్ర సాధన ఉద్యమానికి అనేక అంశాల్లో తేడాలు ఉన్నాయి. అప్పటి ఉద్యమం ఉద్యోగం, ఉపాధి, స్థానికత లాంటి సమస్యల కేంద్రంగా ఉద్యోగుల, విద్యార్థుల భాగస్వామ్యంతో జరిగింది. ఇటీవలి ఉద్యమం విశాల ప్రజానీకం ప్రత్యక్ష ప్రమేయంతో అనేక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాల చుట్టూ అల్లుకొని కొనసాగింది. ఈ ప్రజా ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఎంతో కీలకమైన పాత్ర పోషించింది.

1992లోనే రెండు జీవనదుల మధ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ సస్యశ్యామల యాత్ర జరిగింది. 1997లో కాకినాడలో రెండు రాష్ట్రాల కోసం బీజేపీ తీర్మానించింది. ఇలా ఒకరకంగా మలిదశ ఉద్యమాన్ని బీజేపీ శ్రేణులే ప్రారంభించాయి.


అంబేడ్కర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా బీజేపీ పరిపాలన సౌలభ్యం కోసం, అభివృద్ధి కోసం చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‍పేయి నేతృత్వంలో మూడు కొత్త రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఏర్పాటయ్యాయి. మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల అసెంబ్లీల్లో చేసిన తీర్మానాలతో ఎలాంటి ప్రతిఘటనలు లేకుండా సామరస్యపూర్వకంగా బీజేపీ ఈ రాష్ట్రాలను ఏర్పాటు చేయగలిగింది. తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దాటవేసే నిర్ణయాలు, రాజకీయ స్వలాభాల వైపే మొగ్గు చూపింది తప్ప, ఏనాడూ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి మద్దతివ్వలేదు. ఫలితంగానే మలిదశ ఉద్యమంలో 1200 మంది యువకులు బలిదానం చేసుకున్నారు.

మలిదశ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ పార్టీ నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పడు నిందలు వేస్తూ వచ్చింది. 2006 ఏప్రిల్‌లో ఆనాడు లోక్‍సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎల్.కె. అద్వానీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇష్టం లేదంటూ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసింది. ఈ విషయమై 2006 ఏప్రిల్ 27న స్వయంగా ఎల్.కె. అద్వానీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక రాష్ట్ర బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 2002 జనవరి 5న సోనియాగాంధీకి రాసిన ఉత్తర సారాంశాన్ని మార్చివేసి అద్వానీని, బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ బేషరతుగా ఇవ్వాలని అద్వానీ డిమాండ్ చేస్తే సెకండ్ ఎస్సార్సీ అంటూ మాట మార్చింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీయే మద్దతు లేకుండానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే అవకాశముందని అద్వానీ చెప్పారు. మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన క్రమంలో ఆనాటి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణకు సై అంటూ బహిరంగ ప్రకటన చేశారు. ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సుష్మాస్వరాజ్, అరుణ్‌ జైట్లీతో పాటు అనేక మంది సీనియర్ నాయకులు మద్దతుగా నిలిచారు. తెలంగాణలో జేఏసీ ఏర్పడినప్పుడు కూడా బీజేపీ పార్టీ అందులో భాగమైంది. ప్రతి జేఏసీ పిలుపులో కీలకపాత్ర పోషించింది.


ఢిల్లీ కేంద్రంగా సెప్టెంబరు 2012లో మూడురోజుల పోరు దీక్ష, అదేవిధంగా పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాలను బీజేపీ భుజాన వేసుకుంది. కిషన్‌రెడ్డి నాయకత్వంలో ఇవి జరిగాయి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఉద్యమకారులను ఢిల్లీ పోలీసులచే గుర్రాలతో తొక్కించి, వాటర్ గన్స్‌తో దాడి చేయించింది. ఆ సందర్భంలో వందలాదిమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. బాధితులందరినీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన సభలో సుష్మాస్వరాజ్ పరామర్శించి కన్నీటిపర్యంతమయ్యారు. పార్లమెంటులో తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసా అని కాంగ్రెస్‌ను నిలదీశారు. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నల్లు ఇంద్రసేనారెడ్డి సహా డాక్టర్ కె. లక్ష్మణ్, నేటి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం తీవ్రంగా గాయపడ్డారు. వందలాదిమందిని అరెస్టు చేశారు. గాయపడిన కార్యకర్తలందరినీ ఇప్పటి కోశాధికారి శాంత కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్‌గా ఈ ఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని.


ఆనాటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలంగాణ సంకల్ప యాత్ర పేరిట ఉత్తర తెలంగాణలో చేసిన యాత్రకు సబ్బండవర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా నల్లు ఇంద్రసేనారెడ్డి, బంగారు లక్ష్మణ్ ప్రజల ముందుకు వెళ్లగా, సిహెచ్.విద్యాసాగర్ రావు, జి.కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్‌లు ప్రత్యేక కమిటీల ద్వారా ఉద్యమాన్నిమరింత బలోపేతం చేశారు. జేఏసీలో భాగస్వామై వంటావార్పులు, రైల్ రోకోలు, రాస్తారోకోలు, సాగరహారం, మిలియన్ మార్చ్‌లతో పాటు ఆయా జిల్లాలో పెద్దఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరిచారు. తెలంగాణ సాధన కోసం బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేయగా, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు సైతం రాజీనామాలు చేసిన సందర్భంలో, వారిపై బీజేపీ అభ్యర్థులను నిలబెట్టకుండా వారి గెలుపు కోసం కృషి చేసింది పార్టీ. ఇలా ఎన్నో చర్యల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమని బీజేపీ ప్రజానీకానికి స్పష్టం చేసింది.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పార్లమెంటులో బిల్లు పెడితే అనుకూలంగా ఓటు వేస్తామని ప్రతిపక్షనేత సుష్మా స్వరాజ్ చెప్పి మాట నిలుపుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఓటు వేసి బీజేపీ చిత్తశుద్ధితో వ్యవహరించింది. సుదీర్ఘ కాలంగా ప్రజల్లో ఉన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బీజేపీ మద్దతుతోనే సాకారమైంది.

ఎస్. కుమార్

బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి

Updated Date - Jun 19 , 2024 | 05:29 AM