వైఫై-6 రౌటర్ల తయారీలోకి సెల్‌కాన్
ABN , Publish Date - Jul 02 , 2024 | 01:55 AM
సెల్‌కాన్ గ్రూప్ కొత్తగా వైఫై-6 రౌటర్ల తయారీలోకి ప్రవేశిస్తోంది. సెల్‌కాన్ అనుబంధ సంస్థ సెల్‌కాన్ రిసొల్యూట్ ఇందుకోసం టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీలోని చైనా దిగ్గజ సంస్థ...
జెడ్‌టీఈ టెలికాంతో జట్టు
ఆగస్టు నుంచి తిరుపతి ప్లాంటులో ఉత్పత్తి
1,000 మందికి ఉపాధి అవకాశాలు
అమరావతి (ఆంధ్రజ్యోతి): సెల్‌కాన్ గ్రూప్ కొత్తగా వైఫై-6 రౌటర్ల తయారీలోకి ప్రవేశిస్తోంది. సెల్‌కాన్ అనుబంధ సంస్థ సెల్‌కాన్ రిసొల్యూట్ ఇందుకోసం టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీలోని చైనా దిగ్గజ సంస్థ జెడ్‌టీఈ టెలికాంతో చేతులు కలిపింది. గత నెల 29న ఉండవల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో జెడ్‌టీఈ సీఈవో లేవో చావ్, సెల్‌కాన్ గ్రూప్ సీఎండీ వై గురు, రిసొల్యూట్ గ్రూప్ ఫౌండర్, సీఎండీ రమీందర్ సోయిన్ ఈ వివరాలు వెల్లడించారు.
తిరుపతిలో ప్లాంటు: తిరుపతిలో ఉన్న ఎలకా్ట్రనిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ-1)లో సెల్‌కాన్ రిసొల్యూట్ ఇందుకోసం ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేయనుందని సెల్‌కాన్ గ్రూప్ సీఎండీ గురు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టుకల్లా ఈ ప్లాంటులో వైఫై-6 రౌటర్ల ఉత్పత్తిని చేపట్టనున్నారు. తొలుత నెలకు 2 లక్షల యూనిట్లతో ఉత్పత్తిని ప్రారంభించి ఏడాది చివరి నాటికి దీన్ని 5 లక్షల యూనిట్లకు పెంచనున్నారు. విదేశాలకు ఈ రౌటర్లను ఎగుమతి చేయాలని కంపె నీ భావిస్తోంది. కాగా ఈ ప్లాంట్ ద్వారా తొలిదశలో 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని గురు తెలిపారు.
రాష్ట్రానికి శుభసూచకం: మంత్రి లోకేష్
చైనా దిగ్గజ సంస్థ జెడ్‌టీఈ ఏపీకి రావడం శుభసూచకమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రానున్న రోజుల్లో జెడ్‌టీఈ గ్రూప్‌నకు చెందిన ఇతర విభాగాలు కూడా రాష్ట్రంలో తమ ఉత్పత్తుల తయారీని ప్రారంభించాలని ఆయన కోరారు. ఎలకా్ట్రనిక్స్, ఐవోటీ రంగంలో కీలకంగా ఉన్న జెడ్‌టీఈతో జట్టు కట్టడం సంతోషాన్నిస్తోందని సెల్‌కాన్ గ్రూప్ సీఎండీ గురు తెలిపారు.