Share News

పత్రాల కోసం క్లెయిమ్‌ను తిరస్కరించొద్దు..

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:06 AM

సాధారణ బీమా కంపెనీలు పత్రాల కోసం బీమా క్లెయిమ్‌ను తిరస్కరించరాదని భారత బీమా అభివృద్ధి, నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) స్పష్టం చేసింది. సాధారణ బీమా సేవల సంస్కరణలో...

పత్రాల కోసం క్లెయిమ్‌ను తిరస్కరించొద్దు..

  • సాధారణ బీమా కంపెనీలకు మాస్టర్‌ సర్క్యులర్‌ జారీ చేసిన ఐఆర్‌డీఏఐ

  • న్యూఢిల్లీ: సాధారణ బీమా కంపెనీలు పత్రాల కోసం బీమా క్లెయిమ్‌ను తిరస్కరించరాదని భారత బీమా అభివృద్ధి, నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) స్పష్టం చేసింది. సాధారణ బీమా సేవల సంస్కరణలో భాగంగా విడుదల చేసిన మాస్టర్‌ సర్క్యులర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘పత్రాల కోసం పాలసీదారులకు సంబంధించిన ఎటువంటి దావానూ తిరస్కరించడానికి వీల్లేదు. అవసరమైన పత్రాలను పాలసీ అండర్‌ రైటింగ్‌ సమయంలోనే కోరాలి. అలాగే, పాలసీదారు నుంచి క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సంబంధిత, అవసరమైన పత్రాలను మాత్రమే కోరాలి. అదీ, క్యాష్‌లెస్‌ వసతి అందుబాటులో లేకపోతేనే’’ అని సర్క్యులర్‌లో పేర్కొంది. మరిన్ని విషయాలు..


  • పాలసీదారు ఏ సమయంలోనైనా బీమా కంపెనీకి సమాచారం అందించి పాలసీని రద్దు చేసుకోవచ్చు. బీమా కంపెనీ మాత్రం పాలసీదారు మోసానికి పాల్పడినట్లు నిరూపించాకే పాలసీని రద్దు చేసే వీలుంటుంది. పాలసీ రద్దు సందర్భంలో, పాలసీదారుకు ప్రీమియాన్ని దామాషా పద్ధతిలో రిఫండ్‌ చేయాల్సి ఉంటుంది.

  • జూక్లెయిమ్‌ సెటిల్‌మెంట్స్‌కు సంబంధించి సర్వేయర్‌ నియామకం, వారి రిపోర్టుల సమర్పణ సహా మిగతా అంశాలకు సంబంధించి ఐఆర్‌డీఏఐ కఠిన కాలక్రమాన్ని నిర్దేశించింది. సకాలంలో సర్వేయర్‌ నుంచి నివేదికల పొందడం బీమా సంస్థ విధి అని నియంత్రణ మండలి స్పష్టం చేసింది.

  • వాహన బీమా విషయంలో పే యాజ్‌ యూ డ్రైవ్‌/ పే యాజ్‌ యూ గో ఆప్షన్లను కస్టమర్లకు మొదటి ఎంపికగా అందించాలి.

  • గృహ యజమానులకు అగ్ని ప్రమాద బీమా పాలసీలో వరదలు, తుఫాను, భూకంపాలు, కొండచరియలు విరిగి పడటం, గుట్టలు కూలడం, తీవ్రవాద నష్టాలు వంటి యాడ్‌ ఆన్‌ కవరేజీలను ఎంపిక చేసుకునే అప్షన్‌ కూడా కల్పించాలి. అలాగే, అగ్ని ప్రమాదంతో పాటు అనుబంధ ప్రమాదాల సమగ్ర పాలసీ నుంచి ఏదో ఒక కవరేజీ నుంచి వైదొలిగే వెసులుబాటునూ కల్పించాలి.

  • బీమా కంపెనీలు పాలసీదారుకు బీమా పథకానికి సంబంధించిన కీలక సమాచారాన్ని సరళంగా, స్పష్టంగా, సంక్షిప్తంగా వివరించే కస్టమర్‌ ఇన్ఫర్మేషన్‌ షీట్‌ (సీఐఎస్‌) అందించాల్సి ఉంటుంది.

Updated Date - Jun 12 , 2024 | 02:06 AM