Share News

ఎస్‌బీఐ భళా

ABN , Publish Date - Nov 09 , 2024 | 06:19 AM

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది.

ఎస్‌బీఐ భళా

క్యూ2లో 23 శాతం వృద్ధితో రూ.19,782 కోట్లకు లాభం

ముంబై: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) బ్యాంక్‌ రూ.19,782 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇదే కాలానికి ఆర్జించిన రూ.16,099 కోట్ల లాభంతో పోలిస్తే 23 శాతం వృద్ధి కనబరిచింది. వడ్డీయేతర ఆదాయం పుంజుకోవడం, ట్రెజరీ కార్యకలాపాల ద్వారా లాభాలు పెరగడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. కాగా, ఈ క్యూ2లో ఎస్‌బీఐ స్టాండ్‌ఎలోన్‌ లాభం రూ.18,331 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ.14,330 కోట్లు, ఈ జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో గడించిన రూ.17,035 కోట్ల స్టాండ్‌ ఎలోన్‌ లాభం కంటే అధికమిది. బ్యాంక్‌ కొత్త చైర్మన్‌గా తెలంగాణకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు చేపట్టిన ఈ సెప్టెంబరు త్రైమాసికంలో ఎస్‌బీఐ మొత్తం ఆదాయం రూ.1.29 లక్షల కోట్లకు ఎగబాకింది. 2023-24 క్యూ2 లో రెవెన్యూ రూ.1.12 లక్షల కోట్లుగా నమోదైంది. అయితే, మొత్తం వ్యయాలు సైతం రూ.92,752 కోట్ల స్థాయి నుంచి ఈ క్యూ2లో రూ.99,847 కోట్లకు పెరిగాయి.

ఈ జూలై-సెప్టెంబరు కాలానికి ఎస్‌బీఐ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 5.37 శాతం పెరుగుదలతో రూ.41,620 కోట్లుగా నమోదైంది. ఈ సమయంలో బ్యాంక్‌ రుణాల్లో 15 శాతం వృద్ధి నమోదైనప్పటికీ, నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 0.15 శాతం తగ్గి 3.14 శాతానికి జారుకోవడం వడ్డీ ఆదాయ వృద్ధిని పరిమితం చేసింది.

వడ్డీయేతర ఆదా యం 42 శాతం వృద్ధితో రూ.15,271 కోట్లకు పుంజుకుంది. ఫారెక్స్‌, ట్రెజరీ లాభాలు పెరగడం ఇందుకు తోడ్పడింది.

ఆస్తుల నాణ్యత విషయానికొస్తే, ఈ క్యూ2లో కొత్తగా రూ.3,831 కోట్ల రుణాలు మొండి పద్దులుగా మారాయి. ఈ జూన్‌ 30 నాటికి 2.21 శాతంగా ఉన్న బ్యాంక్‌ మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్‌ ఎన్‌పీఏ) సెప్టెంబరు 30 నాటికి 2.13 శాతానికి తగ్గాయి. అయితే, మొండి బకాయిల కోసం కేటాయింపులు మాత్రం దాదాపు రెట్టింపై రూ.3,631 కోట్లకు పెరిగాయి.

గతంలో బ్యాంక్‌ పద్దుల్లోంచి కొట్టివేసిన మొండిబాకీల్లో రూ.2,300 కోట్లను ఈ క్యూ2లో తిరిగి వసూలు చేయగలిగినట్లు శ్రీనివాసులు శెట్టి తెలిపారు.

బ్యాంక్‌ అనుబంధ విభాగాల విషయానికొస్తే, జీవిత బీమా వ్యాపారం లాభం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి (ఏప్రిల్‌-సెప్టెంబరు) రూ.1,049 కోట్లకు పెరిగింది. క్రెడిట్‌ కార్డు వ్యాపార విభాగ లాభం రూ.999 కోట్లకు పరిమితం కాగా.. ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగ లాభం రూ.1,347 కోట్లకు పెరిగింది. జనరల్‌ ఇన్సూరెన్స్‌ విభాగ లాభం రూ.414 కోట్లకు పుంజుకుంది.


వచ్చే ఫిబ్రవరి తర్వాతే రెపో తగ్గింపు

వచ్చే ఏడాది ఫిబ్రవరికి ముందు ఆర్‌బీఐ ప్రామాణిక వడ్డీ (రెపో) రేటును తగ్గించకపోవచ్చని శ్రీనివాసులు శెట్టి అన్నారు. అయితే, తమ రుణాల్లో 42 శాతం.. రెపో వంటి బహిరంగ మార్కెట్‌ ప్రామాణిక రేట్లతో అనుసంధానితమై లేవని.. బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) మెరుగైన స్థాయిలో కొనసాగించేందుకు ఇది దోహదపడుతున్నదన్నారు. బ్యాంకుల ఎన్‌ఐఎంలు నిలకడగా సాగనున్నాయని, డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇప్పటికే పతాక స్థాయికి చేరాయన్నారు.

వార్షిక లాభం.. రూ.లక్ష కోట్ల లక్ష్యం

ఈ ఆర్థిక సంవత్సరానికి 14-16 శాతం రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు. అయితే, డిపాజిట్ల వృద్ధిని మాత్రం గతంలో అంచనా వేసిన 12-13 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకున్నట్లు తెలిపారు. దేశంలోని వాణిజ్య సంస్థల్లోకెల్లా ఎస్‌బీఐదే అత్యధిక నికర లాభమన్న శెట్టి.. పూర్తి ఆర్థిక సంవత్సర నికర లాభాన్ని రూ.లక్ష కోట్ల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ లక్ష్యంలో భాగంగా తొలుత బ్యాంక్‌ నిర్వహణ లాభాన్ని రూ.లక్ష కోట్ల స్థాయికి పెంచి, ఆ తర్వాత నికర లాభాన్నీ ఆ స్థాయికి చేర్చాలనుకుంటున్నట్లు శుక్రవారం బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలు విడుదల చేసిన అనంతరం మీడియాతో అన్నారు. అయితే, ఎప్పటిలోగా ఈ లక్ష్యాన్ని చేరుకోనున్న విషయంపైన మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు. సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్ధంలో ఎస్‌బీఐ నిర్వహణ లాభం రూ.63,895 కోట్లకు చేరుకుంది.

Updated Date - Nov 09 , 2024 | 06:19 AM