ఆరంభ లాభాలు ఆవిరి
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:13 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం మిశ్రమంగా ముగిశాయి. మార్కెట్‌ను ముందుకు నడిపించే అంశాలేమీ లేకపోవడంతోపాటు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం ఇందుకు కారణమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో...
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం మిశ్రమంగా ముగిశాయి. మార్కెట్‌ను ముందుకు నడిపించే అంశాలేమీ లేకపోవడంతోపాటు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం ఇందుకు కారణమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో 425 పాయింట్ల వరకు ఎగిసిన సెన్సెక్స్.. తొలి గంటలోనే లాభాలను పూర్తిగా కోల్పోయింది. ఆ తర్వాత అతి స్వల్ప లాభ, నష్టాల మధ్య కదలాడిన సూచీ.. చివరికి 0.39 పాయింట్ల నష్టంతో 78,472.48 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 22.55 పాయింట్ల పెరుగుదలతో 23,750.20 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 17 నష్టపోయాయి. అందులో టైటాన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు ఒక శాతానికి పైగా క్షీణించాయి. మార్కెట్ స్తబ్దుగా కొనసాగినప్పటికీ, అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 5 శాతానికి పైగా పుంజుకుంది. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్ సూచీ 0.24 శాతం తగ్గగా.. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.11 శాతం పెరిగింది. రంగాలవారీ సూచీల్లో సర్వీసెస్ 1.80 శాతం ఎగబాకగా.. ఆటో 0.81 శాతం పెరిగింది. కమోడిటీ, ఇండస్ట్రియల్స్, టెలికాం, మెటల్, ఐటీ, బ్యాంకింగ్ సూచీలు మాత్రం నష్టపోయాయి.
అయ్యో.. రూపాయి!
భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 12 పైసలు క్షీణించి రూ.85.27 వద్ద ముగిసింది. రూపీ బలహీనపడటం వరుసగా ఇది మూడో రోజు. అంతర్జాతీయంగా డాలర్ మరింత బలపడటంతో పాటు బ్రెంట్ ముడిచమురు ధర మళ్లీ 74 డాలర్లకు ఎగబాకడం ఇందుకు ప్రధాన కారణాలు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ సుంకాల వడ్డన హెచ్చరికల నేపథ్యంలో దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరిగిందని ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.