Share News

ఆర్థిక సర్వే 2023-24

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:32 AM

కొన్ని రంగాల్లోని ఉద్యోగాలపై కృత్రి మేధ (ఏఐ) ప్రభావం తప్పదని ఆర్థిక సర్వే హెచ్చరించింది. భవిష్యత్‌లో అన్ని రంగాల్లోని ఉద్యోగాల స్వరూప, స్వభావాలను ఏఐ మార్చి వేస్తుందని తెలిపింది. అయితే అన్ని రకాల ఉద్యోగులు, కార్మికుల నైపుణ్యాలపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందనే...

ఆర్థిక సర్వే 2023-24

ఏఐతో కుదుపు తప్పదు

కొన్ని రంగాల్లోని ఉద్యోగాలపై కృత్రి మేధ (ఏఐ) ప్రభావం తప్పదని ఆర్థిక సర్వే హెచ్చరించింది. భవిష్యత్‌లో అన్ని రంగాల్లోని ఉద్యోగాల స్వరూప, స్వభావాలను ఏఐ మార్చి వేస్తుందని తెలిపింది. అయితే అన్ని రకాల ఉద్యోగులు, కార్మికుల నైపుణ్యాలపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది. ఉత్పాదకతను భారీగా పెంచే ఏఐ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చివేసే అవకాశం ఉందని అంచనా వేసింది. విద్యుత్‌, ఇంటర్నెట్‌ లానే.. ఏఐ కూడా నిత్య జీవితంలో తప్పనిసరిగా మారుతోందని తెలిపింది. ఏఐ కారణంగా కస్టమర్‌ సర్వీసెస్‌ వంటి రంగాల్లో ఆటోమేషన్‌ పెరిగి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించింది. అయితే ఇమేజ్‌, వీడియోల చిత్రీకరణ వంటి సృజనాత్మక రంగాల్లో ఏఐ టూల్స్‌ని విరివిగా ఉపయోగిస్తారని అంచనా వేసింది. ఏఐ ట్యూటర్ల కారణంగా విద్యా రంగంలోనూ మార్పులు తప్పవని పేర్కొంది. ఏఐ కారణంగా కొత్త ఔషధాల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని సర్వే తెలిపింది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఏఐ టెక్నాలజీని మన దేశం ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని కోరింది.


చైనా నుంచి మరింత ఎఫ్‌డీఐ

చైనా నుంచి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎ్‌ఫడీఐ)లు ఆకర్షించేందుకు దృష్టి పెట్టాలని ఆర్థిక సర్వే ప్రభుత్వాన్ని కోరింది. ఇలా చేయడం ద్వారా అమెరికా, ఈయూ వంటి దేశాలకు మన ఎగుమతులు మరింత పెంచుకోవచ్చని సూచించింది. ప్రస్తుతం ఈ దేశాలు ‘చైనా వన్‌ ప్లస్‌’ వ్యూహంలో భాగంగా తమకు అవసరమైన వస్తు, సేవల కోసం భారత్‌ వంటి దేశాలవైపు చూస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. చైనా ఎఫ్‌డీఐని సరళీకృతం చేస్తే, ఆ దేశ కంపెనీలు మన దేశంలో తమ యూనిట్లు ఏర్పాటు చేసుకుని, మన దేశం నుంచి తమ సరుకులను అమెరికా, ఈయూ దేశాలకు ఎగుమతి చేయగలుగుతాయని తెలిపింది. గల్వాన్‌ ఘర్షణల తర్వాత చైనా కంపెనీలు భారత్‌లో పెట్టే పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. దీనికి తోడు చైనా కంపెనీలు కూడా మన దేశంలో తమ యూనిట్లు ఏర్పాటు చేయడం కంటే, తమ సరుకులను చౌకగా దిగుమతి చేయడంపైనే ఆసక్తి చూపిస్తున్నాయి. అమెరికా, ఈయు,సింగపూర్‌, జపాన్‌, కొరియా వంటి దేశాల నుంచి మన దేశానికి పెద్ద ఎత్తున ఎఫ్‌డీఐ వస్తోంది. గత పాతికేళ్లలో మన దేశానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐలో చైనా వాటా కేవలం 0.37 శాతం (250 కోట్ల డాలర్లు) మాత్రమే. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వే చైనా నుంచి మరింత ఎఫ్‌డీఐకి ప్రయత్నించాలని సూచించడం విశేషం. అయితే కీలకమైన వ్యూహాత్మక ఖనిజాల కోసం చైనాపై ఆధారపడడం ఏ మాత్రం మంచిది కాదని సర్వే స్పష్టం చేసింది.


మానసిక ఆరోగ్యం కీలకం

ప్రజల మానసిక ఆరోగ్యం, ఆహార అలవాట్లపైనా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్థిక సర్వే తెలిపింది. లేకపోతే అధిక జనాభా ప్రయోజనాలను మన ఆర్థిక వ్యవస్థ అందుకోలేదని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రజలు ఆరోగ్యకర ఆహార అలవాట్లు పెంపొందించుకోవాలని కోరింది. మానసిక ఆరోగ్యం ప్రభావం వ్యక్తుల మీదేగాక, దేశ అభివృద్ధిపైనా ఉంటుందని తెలిపింది. అయినా ఈ అంశంపై మన దేశంలో పెద్దగా చర్చ జరగక పోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మన ప్రజలు ఎదుర్కొంటున్న వ్యాధుల్లో 56.4 శాతానికి అనారోగ్యకర ఆహార అలవాట్లే కారణమన్న భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) నివేదికను సర్వే ఈ సందర్భంగా ఉదహరించింది. చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాపెస్‌ చేసిన ఆహార పదార్ధాలు ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తున్నాయని తెలిపింది. సరైన వ్యాయామం లేకపోవడం, సరైన పోషకాహారం అందుబాటులో లేకపోవడం ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తోందని పేర్కొంది.


వృద్ధి లక్ష్యాలను అందుకుంటాం

ఆర్థిక సర్వేలో ప్రకటించిన వృద్ధి అంచనాలను అందుకోవటం సాధ్యమేనని ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్‌ అన్నారు. రుతుపవనాలు, అంతర్జాతీయ ఆర్థిక రిస్క్‌లను దృష్టిలో ఉంచుకునే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5-7 శాతం మధ్యన ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో వృద్ధి రేటు 8.2 శాతంగా ఉన్న విషయం విదితమే. వృద్ధి రేటు పట్ల తమకు నిరాశావహమైన ఆలోచనేదీ లేదని, పూర్తిగా ఆశావహమైన ధోరణిలోనే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రుతుపవనాల పురోగతిని పరిశీలించిన తర్వాతే నిర్ధేశిత వృద్ధి లక్ష్యాలను ప్రకటించామని నాగేశ్వరన్‌ తెలిపారు. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చితే భారత బహిర్గత రుణ నిష్పత్తి తక్కువ స్థాయిలో ఉందని, అంతేకాకుండా ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలో ఉందని, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రైవేట్‌ పెట్టుబడులు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అంతరాలు పూడ్చేలా పన్ను విధానాలు

ఆదాయ అంతరాలు పూడ్చడంలో ముందు ముందు పన్ను విధానాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆర్థిక సర్వే తెలిపింది. అంతర్జాతీయంగానూ ఈ సమస్య విధాన నిర్ణేతలకు పెద్ద ఆర్థిక సవాల్‌గా మారిందని పేర్కొంది. మన దేశంలో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సర్వే వివరించింది. ఉద్యోగాల కల్పన, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంతో అనుసంధానం చేయడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మహిళల పాత్ర పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించేందుకు మన దేశం ప్రయత్నిస్తోందని తెలిపింది. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా భవిష్యత్‌లో ఉద్యోగ, ఆదాయాలపై ప్రతికూల ప్రభావం తప్పదని కూడా సర్వే హెచ్చరించింది.

Updated Date - Jul 23 , 2024 | 05:32 AM