Share News

ఈ-కామర్స్‌ విక్రేతలకు ఈడీ షాక్‌

ABN , Publish Date - Nov 08 , 2024 | 06:15 AM

ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌.. ఫ్రిఫర్డ్‌ విక్రేతల (వెండార్స్‌)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం షాకిచ్చింది.

ఈ-కామర్స్‌ విక్రేతలకు ఈడీ షాక్‌

  • హైదరాబాద్‌ సహా 15 చోట్ల సోదాలు

న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌.. ఫ్రిఫర్డ్‌ విక్రేతల (వెండార్స్‌)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం షాకిచ్చింది. హైదరారాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, పంచకుల, గురుగ్రామ్‌లలో వారికి చెందిన 15 కార్యాలయాల్లో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో ఈడీ అధికారులు కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) తుంగలో తొక్కి ప్రిఫర్డ్‌ వర్తకుల ద్వారా ఈ సంస్థలు అడ్డగోలు డిస్కౌంట్లతో దేశంలోని చిన్న చిన్న వ్యాపారుల పొట్టకొడుతున్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు జరపడం విశేషం. అయితే అమెజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటి వరకు ఈ సోదాలపై నోరు విప్పలేదు. ఈడీ తాజా చర్యను అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) ప్రధాన కార్యదర్శి, బీజేపీ ఎంపీ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ స్వాగతించారు. ఎట్టకేలకు ఈడీ సరైన చర్యలు తీసుకుందన్నారు. కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కూడా ఇప్పటికే ఈ సంస్థలకు పెనాల్టీ నోటీసులు జారీ చేసిందన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 06:15 AM