ప్రవాస టెకీలు చలో భారత్!
ABN , Publish Date - Mar 03 , 2024 | 01:58 AM
అమెరికా, యూరప్, తదితర దేశాల్లో పనిచేస్తున్న భారత టెకీల్లో స్వదేశంలో ఉద్యోగావకాశాలపై ఆసక్తి పెరుగుతున్నదని రిక్రూటింగ్, స్టాఫిం గ్ సేవల రంగ ప్రతినిధులు అంటున్నారు. భారత్‌లో ఉద్యోగావకాశాల కోసం...
స్వదేశంలో ఉద్యోగావకాశాలపై క్రమంగా పెరుగుతున్న ఆసక్తి
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్, తదితర దేశాల్లో పనిచేస్తున్న భారత టెకీల్లో స్వదేశంలో ఉద్యోగావకాశాలపై ఆసక్తి పెరుగుతున్నదని రిక్రూటింగ్, స్టాఫిం గ్ సేవల రంగ ప్రతినిధులు అంటున్నారు. భారత్‌లో ఉద్యోగావకాశాల కోసం తమను సంప్రదిస్తున్న ప్రవాస టెకీల సంఖ్య గడిచిన కొద్ది నెలల్లో గణనీయంగా పెరిగిందని వారన్నారు. ప్రముఖ జాబ్ పోర్టళ్లతో పాటు లింక్డ్‌ఇన్ నుంచి తన స్టాఫింగ్ కంపెనీ సేకరించిన డేటాను బట్టి చూస్తే, ప్రస్తుతం దేశీయ జాబ్ మార్కెట్లో 38,000 మంది ప్రవాస టెకీలు ఉద్యోగాల కోసం చూస్తున్నారని.. క్రితం నెలతో పోలిస్తే వీరి సంఖ్య రెట్టింపైందని ఎక్స్‌ఫెనో సహ-వ్యవస్థాపకుడు అనిల్ ఏతనూరు అన్నారు. ఏడాది క్రితం 65,000 స్థాయిలో ఉన్న వీరి సంఖ్య ఆ తర్వాత గణనీయంగా తగ్గినప్పటికీ, మళ్లీ కొద్ది నెలలుగా క్రమంగా పెరుగుతూ వస్తోందన్నారు.
స్వదేశానికి తిరిగి వచ్చే ఆలోచనలో ఉన్న ప్రవాస టెకీల నుంచి ఎంక్వైరీలు 15-30 శాతం పెరిగాయన్నారు. అందులో ఐటీ, కన్సల్టింగ్ సేవలు, ఇంజనీరింగ్ రంగాలకు చెందినవారే అధికమని ఆయన పేర్కొన్నారు. నిర్మాణం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన వారు కూడా ఉన్నారన్నారు. అమెరికాలో పనిచేస్తున్న భారత ఐటీ నిపుణుల నుంచి స్వదేశంలో ఉద్యోగం కోసం దరఖాస్తులు 15 శాతం పెరిగాయని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ అండ్ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ కంపెనీ మైకేల్ పేజ్ ఇండియా తెలిపింది. భారత్‌లో ఆధునిక సాంకేతికత ఆధారిత ప్రాజెక్టులు పెరగడం, ప్రస్తుత మందగమనం భారత్ కంటే అమెరికాపై అధిక ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మన ఐటీ నిపుణులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఇదే మంచి సమయమని మైకేల్ పేజ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ ప్రన్షు ఉపాధ్యాయ్ అన్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రొడక్ట్ లేదా ఇంజనీరింగ్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నవారు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లకు తిరిగి స్వదేశంలో స్థిరపడేందుకు మంచి అవకాశమన్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లోనూ కొంద రు అక్కడ ఉద్యోగావకాశాలు లేకపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చేయాలనుకుంటున్నారని కెరీర్‌నెట్ సహ వ్యవస్థాపకులు అన్షుమన్ దాస్ అన్నారు.
కారణాలు..
ప్రపంచ ఐటీ రంగం మందగమనంలోకి జారుకున్నప్పటికీ అమెరికా, ఐరోపాతో పోలిస్తే భారత ఐటీ రంగంలోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి.
విదేశీ టెక్నాలజీ మార్కెట్లో పెరిగిన అనిశ్చితి, బడా కంపెనీల్లో భారీ సంఖ్యలో తీసివేతలు, బాగా తగ్గిన కొత్త నియామకాలతో పాటు జీవన వ్యయం అనూహ్యంగా పెరగడం కూడా ప్రవాస టెకీలకు ఇబ్బందికరంగా మారింది.
కొన్ని దేశాలు మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నాయి. దాంతో ఆ మార్కెట్లు మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
భారత జీడీపీ జోరందుకుంది. విదేశాల్లో కంటే దేశీ ఐటీ రంగంలోనే ఉద్యోగావకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. పైగా, భారత మార్కెట్లో సీనియర్ టెకీలకు ఆకర్షణీయ వేతన ప్యాకేజీలు లభిస్తున్నాయి.
ఇండియాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎంఎన్‌సీల్లో కీలక పదవులకు ఆఫర్ చేస్తున్న ప్యాకేజీలు.. అమెరికాలో లభిస్తున్న వేతనానికి దరిదాపుల్లో ఉంటుండటం కూడా మరో కారణం.