Share News

మార్కెట్‌కు ఫెడ్‌ బూస్ట్‌

ABN , Publish Date - Sep 20 , 2024 | 05:13 AM

అమెరికా కేంద్ర బ్యాంక్‌ వడ్డీరేట్లను 0.50 శాతం తగ్గించడం ఈక్విటీ మార్కెట్లకు ఊత్సాహాన్నిచ్చింది. మదుపరులు జోరుగా కొనుగోళ్లు జరపడంతో గురువారం దేశీయ ఈక్విటీ సూచీలు సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి...

మార్కెట్‌కు ఫెడ్‌ బూస్ట్‌

సరికొత్త గరిష్ఠాలకు సూచీలు

ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్‌ వడ్డీరేట్లను 0.50 శాతం తగ్గించడం ఈక్విటీ మార్కెట్లకు ఊత్సాహాన్నిచ్చింది. మదుపరులు జోరుగా కొనుగోళ్లు జరపడంతో గురువారం దేశీయ ఈక్విటీ సూచీలు సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 825.38 పాయింట్లు ఎగబాకి 83,773.61 వద్ద ఆల్‌ టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. కానీ, గరిష్ఠ స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా చివరికి 236.57 పాయింట్ల లాభంతో 83,184.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఉదయం 234.4 పాయింట్ల వృద్ధితో 25,611.95 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసినప్పటికీ, చివరికి 38.25 పాయిం ట్ల లాభంతో 25,415.80 వద్ద క్లోజైంది.

  • ఎన్‌టీపీసీ షేరు 2.45 శాతం రాణించి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 1.06 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.53 శాతం తగ్గాయి.

  • భారత కరెన్సీ రెండు నెలల గరిష్ఠ స్థాయికి పెరిగింది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు పెరిగి 83.65 వద్ద ముగిసింది.


ఐపీఓ సమాచారం

  • ఆర్కేడ్‌ డెవలపర్స్‌ ఐపీఓకు చివరి రోజు నాటికి 106.40 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ లభించగా.. నార్తర్న్‌ ఏఆర్‌సీ క్యాపిటల్‌ ఇష్యూకు 110.71 రెట్ల బిడ్లు వచ్చాయి. వెస్టర్న్‌ క్యారియర్‌ ఆఫర్‌ 30.46 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది.

  • కోల్‌కతాకు చెందిన ఎల్లెన్‌బ్యారీ ఇండస్ట్రియల్స్‌ గ్యాసెస్‌ ఐపీఓకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయి పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.400 కోట్ల విలువైన తాజా ఈక్విటీ జారీతోపాటు ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన 1.44 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయించనుంది.

Updated Date - Sep 20 , 2024 | 05:13 AM