Share News

ఫెడ్‌ రేటు తగ్గిందోచ్‌..

ABN , Publish Date - Sep 19 , 2024 | 06:35 AM

అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ‘ఫెడరల్‌ రిజర్వ్‌’ ప్రామాణిక వడ్డీ రేట్ల తగ్గింపుపై గత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న చర్చకు ఎట్టకేలకు తెరపడింది. బుధవారంతో ముగిసిన పరపతి సమీక్షలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేటును మెజారిటీ విశ్లేషకుల...

ఫెడ్‌ రేటు తగ్గిందోచ్‌..

0.50% తగ్గింపుతో శ్రీకారం

నాలుగేళ్లలో ఇదే తొలిసారి

4.75-5 శాతానికి తగ్గిన ప్రామాణిక వడ్డీ రేట్ల శ్రేణి

న్యూయార్క్‌: అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ‘ఫెడరల్‌ రిజర్వ్‌’ ప్రామాణిక వడ్డీ రేట్ల తగ్గింపుపై గత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న చర్చకు ఎట్టకేలకు తెరపడింది. బుధవారంతో ముగిసిన పరపతి సమీక్షలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేటును మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా అర(0.50) శాతం తగ్గించింది. దాంతో ప్రామాణిక వడ్డీ రేట్ల శ్రేణి 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి 5.25-5.50 శాతం నుంచి 4.75-5.0 శాతానికి తగ్గింది. ఫెడ్‌ రేట్లు తగ్గడం నాలుగేళ్లలో(2020 తర్వాత) ఇదే తొలిసారి. కొవిడ్‌ సంక్షోభం తర్వాత కూడా ఇదే తొలి వడ్డీ రేట్ల తగ్గుదల. ఇక దేశ ఆర్థిక వృద్ధితోపాటు జాబ్‌ మార్కెట్‌కు ఊతమిచ్చేలా మున్ముందు సమీక్షల్లో వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తామని ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సంకేతాలిచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి మరో అర శాతం కోత పెట్టడంతోపాటు వచ్చే ఏడాదిలో ఒక శాతం తగ్గించే అవకాశాలున్నాయంది. 2026లో మరో 0.50 శాతం తగ్గించే అవకాశాలున్నాయి. కాగా, ఫెడ్‌ రిజర్వ్‌ బాటలోనే మరిన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లూ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కూడా వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఫెడ్‌ రేటు తగ్గింపు వార్త వెలువడిన వెంటనే అమెరికన్‌ మార్కెట్లు భారీగా పుంజుకుంది. డౌజోన్స్‌ ఒకదశలో 375 పాయింట్ల వరకు ఎగబాకింది. గురువారం ప్రపంచ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా స్పందించనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది.


4-Buss.jpg

రెపో తగ్గకపోవచ్చు

ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి

ఆహార ధరల ద్రవ్యోల్బణం తగ్గుదలపై ఇంకా అనిశ్చితి తొలగకపోవడంతో ఈ ఏడాదిలో ఆర్‌బీఐ ప్రామాణిక వడ్డీ (రెపో) రేటును తగ్గించకపోవచ్చని ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. ఫెడరల్‌ రిజర్వ్‌ నాలుగేళ్లకు పైగా కాలం తర్వాత తొలిసారిగా ప్రామాణిక వడ్డీ రేటును తగ్గించింది. దాంతో మిగతా దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు కూడా వడ్డీ రేట్ల కోతకు శ్రీకారం చుట్టవచ్చన్న అంచనాలున్నాయి. అయితే, ఈ విషయంపై శెట్టి కొంత భిన్నంగా స్పందించారు. ‘‘వడ్డీ రేట్ల విషయంలో చాలా సెంట్రల్‌ బ్యాంక్‌లు దేశీయ పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటున్నాయి. ఫెడ్‌ రేట్ల తగ్గింపు అందరినీ ప్రభావితం చేయనున్నప్పటికీ, ఆర్‌బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకునే రెపో రేటు పై నిర్ణయం తీసుకోనుందని మేం భావిస్తున్నాం. ఈ ఏడాదిలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని అనుకుంటున్నాం. వచ్చే ఏడాది మార్చి త్రైమాసికం వరకు వేచి చూడాల్సి రావచ్చ’’ని శెట్టి అన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 06:35 AM