Stock Market : రూ.18.43 లక్షల కోట్లు హుష్ కాకి
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:38 AM
మార్కెట్లలో అమెరికన్ ఫెడ్ సృష్టించిన కల్లోలం ఆగలేదు. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో వరుసగా ఐదో రోజు కూడా స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు నమోదు చేశాయి. రిస్క్
మార్కెట్‌పై బిగిసిన బేర్ పట్టు.. 5 సెషన్లలో 4,100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: మార్కెట్లలో అమెరికన్ ఫెడ్ సృష్టించిన కల్లోలం ఆగలేదు. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో వరుసగా ఐదో రోజు కూడా స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు నమోదు చేశాయి. రిస్క్ తీసుకునేందుకు విముఖంగా ఉన్న ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు సాగించారు. దీనికి తోడు ఎఫ్‌పీఐల నిధుల తరలింపు సైతం యధేచ్ఛగా కొనసాగింది. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 1,176.46 పాయింట్లు దిగజారి 78,041.59 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 1343.46 పాయింట్ల నష్టంతో 77,874.59 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 364.20 పాయింట్ల నష్టంతో 23,587.50 వద్ద క్లోజైంది. రెండేళ్ల కాల పరిమితిలో ఒక వారంలో ఈక్విటీ మార్కెట్‌కు ఏర్పడిన భారీ నష్టం ఇదే. బీఎ్‌సఈలో లిస్టయిన షేర్లలో 2,950 షేర్లు నష్టాల్లో ముగియగా 1,045 షేర్లు మాత్రం లాభపడ్డాయి. ఐదు రోజుల వరుస నష్టాల కారణంగా సెన్సెక్స్ 4,091.53 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 1,181 పాయింట్లు నష్టపోయింది. బీఎ్‌సఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ సంపద రూ. 18,43,121.27 కోట్లు తుడిచి పెట్టుకుపోయి రూ.4,40,99,217.32 కోట్లకు (5.18 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో జేఎ్‌సడబ్ల్యూ స్టీల్, నెస్లె, టైటాన్ మినహా మిగతా 27 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. బీఎ ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 2.43 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 2.11 శాతం నష్టపోయాయి.
అన్ని రంగాల వారీ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. రియల్టీ ఇండెక్స్ భారీగా 4.07 శాతం నష్టపోయింది. పవర్ (3.55%), యంత్రపరికరాలు (3.02%), ఇండస్ర్టియల్స్ (2.67ు), ఐటీ (2.51%), కన్స్యూమర్ డిస్‌క్రెషనరీ (2.32%), సర్వీసెస్ (2.29%) నష్టపోయాయి.
ఫెడ్ చీఫ్ వడ్డీ రేట్లపై ప్రకటించిన కఠిన వైఖరితో పాటు అమెరికా అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ తాను అనుసరించనున్న ఆర్థిక, వాణిజ్య విధానాలపై ప్రకటించిన అభిప్రాయాల ఫలితంగా డాలర్ నిరంతరం బలపడుతూ రావడం కూడా మార్కెట్‌ను కుంగదీస్తోందని విశ్లేషకులంటున్నారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు స్థానిక మార్కెట్ నుంచి వైదొలగి డాలర్ ఆస్తుల్లో తమ సొమ్ము ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీల వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు గురువారం రూ.4224.92 కోట్ల విలువ గల షేర్లు విక్రయించారు.
స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ రూ.40 కోట్ల సేకరణ
పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వస్తున్న హైదరా బాద్‌కు చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్.. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ విధానంలో అమన్సా ఇన్వె్‌స్టమెంట్ లిమిటెడ్ నుంచి రూ.40 కోట్లు ప్రీ ఐపీఓ ఫండింగ్‌గా సమీకరించింది. ఒక్కో షేరు రూ.140 ధరపై అమన్సాకు 28.57 లక్షల ఈక్విటీ షేర్లు జారీ చేసింది. ఫార్మా, కెమికల్ పరిశ్రమలకు స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ పరికరాలు తయారుచేసే స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ ఐపీఓకి అక్టోబరులో సెబీ అనుమతి లభించింది.
తగ్గిన ఫారెక్స్ నిల్వలు
డిసెంబరు 13వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 198.8 కోట్ల డాలర్ల మేరకు తగ్గి 65,286.9 కోట్ల డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. రూపాయి ఆటుపోట్లను తగ్గించేందుకు ఆర్‌బీఐ మార్కెట్‌లో జోక్యం చేసుకుంటుండడంతో గత కొద్ది వారాలుగా విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. సెప్టెంబరులో ఇవి చారిత్రక గరిష్ఠ స్థాయి 70,488.5 కోట్ల డాలర్లకు చేరాయి. బంగారం నిల్వలు 112.1 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 6805.6 కోట్ల డాలర్లకు చేరాయి.
గ్రాన్యూల్స్ ఇండియాలో ఫిడెలిటీ వాటా విక్రయం
గ్రాన్యూల్స్ ఇండియాలో పైనాన్షియల్ సేవల సంస్థ ఫిడెలిటీ ఇన్వె్‌స్టమెంట్స్ 1.32 శాతం వాటాను రూ.191 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఈ వాటాలను విక్రయించింది. తన అనుబంధ విభాగాలైన ఫిడెలిటీ ఇండియా ఫండ్, డెన్‌డాన ఇన్వెస్ట్ మారిషస్, ఫిడెలిటీ ఫండ్స్- ఇండియా ఫోకస్ ఫండ్.. గ్రాన్యూల్స్ ఇండియాలో 1.32 శాతానికి సమానమైన 32 లక్షల షేర్లను విక్రయించాయి. సగటున ఒక్కో షేరును రూ.596కి ఈ సంస్థలు విక్రయించాయి.