Share News

Gold Prices: రూ.66,000 ఎగువకు బంగారం

ABN , Publish Date - Mar 10 , 2024 | 06:16 AM

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. శనివారం పసిడి ధర తొలిసారిగా రూ.66,000 మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసుకుంది...

Gold Prices: రూ.66,000 ఎగువకు బంగారం

మరో రూ.540 పెరుగుదలతో సరికొత్త రికార్డు గరిష్ఠానికి చేరిక

హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. శనివారం పసిడి ధర తొలిసారిగా రూ.66,000 మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసుకుంది. హైదరాబాద్‌ మార్కెట్లో పది గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం మరో రూ.540 పెరుగుదలతో రూ.66,270కి చేరుకుంది. 22 క్యారెట్ల స్వచ్ఛత లోహం రూ.500 పెరిగి రూ.60,750 ధర పలికింది. కిలో వెండి రూ.79,100 స్థాయిలో అమ్ముడుపోయింది. అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడం ఇందుకు కారణమైంది. గడిచిన ఐదు రోజుల్లో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.2,180 పెరిగింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ సరికొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయి 2,185 డాలర్లకు చేరుకుంది. సిల్వర్‌ 24.52 డాలర్ల వద్ద ట్రేడైంది. అమెరికాలో విడుదలైన తాజా నిరుద్యోగ గణాంకాలు, ఫెడ్‌ రేట్ల తగ్గింపు త్వరలోనే ప్రారంభం కావచ్చన్న అంచనాలను పెంచాయి. దాంతో విలువైన లోహాల్లోకి పెట్టుబడులు మరింత పెరిగాయి. ఎందుకంటే, ఫెడ్‌ రేట్లు-గోల్డ్‌ డిమాండ్‌ది విలోమ సంబంధం. ఫెడ్‌ రేట్లు పెరుగుతున్న సమయంలో బంగారం కంటే స్థిర ఆదాయాన్ని పంచే బాండ్లు, మార్కెట్‌ ఫండ్స్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గుతున్న సందర్భంలో బాండ్ల నుంచి పెట్టుబడులు విలువైన లోహాల్లోకి మళ్లుతుంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 08:47 AM