గోల్డెన్ ఇయర్
ABN , Publish Date - Dec 15 , 2024 | 02:23 AM
ఈ ఏడాది (2024) బంగారం మదుపరులకు అద్భుతమైన రిటర్నులు అందించింది. ఈ ఏడాది ఇప్పటివరకు పసిడి ధర గ్రాముకు ఏకంగా రూ.7,300 మేర (30 శాతానికి పైగా) పెరిగింది....
ఈ ఏడాదిలో 30 శాతానికి పైగా పెరిగిన పసిడి
దశాబ్దకాలంలో ఇదే అత్యుత్తమ వృద్ధి
సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్ల డిమాండే కారణం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఈ ఏడాది (2024) బంగారం మదుపరులకు అద్భుతమైన రిటర్నులు అందించింది. ఈ ఏడాది ఇప్పటివరకు పసిడి ధర గ్రాముకు ఏకంగా రూ.7,300 మేర (30 శాతానికి పైగా) పెరిగింది. బులియన్ ఇన్వెస్టర్లకు దశాబ్ద కాలంలో ఇదే అత్యుత్తమ వార్షిక ప్రతిఫలమని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లతో పాటు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోళ్లకు పాల్పడటం ఇందుకు కారణమైంది. అయితే, ధర అమాంతం పెరగడంతో సామాన్య ప్రజానీకం స్వర్ణభరణాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి.
ఈ ఏడాదిలో సెప్టెంబరుతో ముగిసిన మూడు త్రైమాసికాల్లో ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు మొత్తం 694 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. అందులో భారత్ వంటి వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లే అధికమని రిపోర్టు పేర్కొంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అక్టోబరులోనే 27 టన్నులు కొనుగోలు చేసింది. ఈ ఏడాది అక్టోబరు వరకు ఆర్‌బీఐ బంగారం నిల్వలను 77 టన్నుల మేర పెంచుకుంది. 2023తో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ కొనుగోలు చేసింది. కాగా, టర్కీ 72 టన్నులు, పోలాండ్ 69 టన్నుల కొనుగోళ్లు జరిపింది. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ రేట్ల తగ్గుదల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారంలో పెట్టుబడులకు డిమాండ్ ఊపందుకుంది. దాంతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో పసిడి వేగంగా పరుగు తీసింది.
2025లో రిటర్నులు అంతంతే..
అయితే 2025లో మాత్రం పసిడి పరుగు నెమ్మదించవచ్చని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సేవల మార్కెట్‌పై ఆయన వాణిజ్య విధానాల ప్రభావంతో పాటు బులియన్ ర్యాలీకి పలు సవాళ్లు ఎదురుకావచ్చన్నారు. ప్రపంచంలో అతిపెద్ద బంగారం వినియోగదారైన చైనా ఆర్థిక పరిస్థితులూ బులియన్ డిమాండ్‌ను ప్రభావితం చేయనున్నాయి. ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో చైనాలోనూ వినియోగదారులు బంగారం కొనుగోళ్ల విషయంలో వేచి చూసే ధోరణిని కనబరుస్తున్నారని డబ్ల్యూజీసీ పేర్కొంది. సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్ల కొనుగోళ్లు అంచనాలను మించితే తప్ప వచ్చే ఏడాదీ పసిడి జోరు కొనసాగకపోవచ్చని భావిస్తున్నారు.
2025 డిసెంబరు నాటికి ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ 3,000-3,150 డాలర్ల స్థాయికి చేరుకోచవ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. అంటే, ప్రస్తుత 2,650 డాలర్ల స్థాయితో పోలిస్తే వచ్చే ఏడాది పసిడి 17 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి. కాగా, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఔన్స్ గోల్డ్ 2,900-3,000 డాలర్లకు చేరవచ్చని స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ అంచనా వేసింది.