Share News

జీఎ్‌సటీ ఆదాయం రూ.1.87 లక్షల కోట్లు

ABN , Publish Date - Nov 02 , 2024 | 06:23 AM

అక్టోబరు నెలలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 9 శాతం పెరిగి రూ.1.87 లక్షల కోట్లకు చేరుకుంది.

జీఎ్‌సటీ ఆదాయం రూ.1.87 లక్షల కోట్లు

రెండో అత్యధిక నెలవారీ వసూళ్లివి..

ఏపీలో 12%,

తెలంగాణలో 7% వృద్ధి

న్యూఢిల్లీ: అక్టోబరు నెలలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 9 శాతం పెరిగి రూ.1.87 లక్షల కోట్లకు చేరుకుంది. 2017 జూలై నెలలో జీఎ్‌సటీ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి రెండో అత్యధిక నెలవారీ వసూళ్లివి. దేశీయంగా విక్రయాలు పుంజుకోవడంతోపాటు నిబంధనలకు లోబడి సక్రమంగా పన్ను చెల్లింపులు పెరగడం ఇందుకు దోహదపడింది. గత ఏడాది అక్టోబరులో జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుండగా.. ఈ ఏప్రిల్‌లో ఆదాయం ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.2.10 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, గతనెలలో తెలంగాణ జీఎ్‌సటీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 7 శాతం పెరిగి రూ.5,211 కోట్లకు, ఆంధ్రప్రదేశ్‌ వసూళ్లు 12 శాతం వృద్ధితో రూ.3,815 కోట్లకు చేరుకున్నాయి. ఈ అక్టోబరులో సెంట్రల్‌ జీఎ్‌సటీ ఆదాయం రూ.33,821 కోట్లు, స్టేట్‌ జీఎ్‌సటీ రూ.41,864 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ రూ.99,111 కోట్లుగా నమోదయ్యాయి. సుంకం రూపంలో మరో రూ.12,550 కోట్లు వసూలయ్యాయి. గతనెలలో దేశీయంగా లావాదేవీలు 10.6 శాతం పెరిగి రూ.1.42 లక్షల కోట్లుగా నమోదు కాగా.. దిగుమతులపై పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం 4 శాతం పెరుగుదలతో రూ.45,096 కోట్లుగా ఉంది. కాగా, గతనెలలో జారీ చేసిన రూ.19,306 కోట్ల రిఫండ్లు మినహాయించగా.. జీఎ్‌సటీ నికరాదాయం రూ.1.68 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఇది 8 శాతం అధికం.

Updated Date - Nov 02 , 2024 | 06:23 AM