Share News

Dhanteras 2024: బంగారం కొనాలా.. నాణ్యతను ఈజీగా ఇలా చెక్ చేయండి

ABN , Publish Date - Oct 28 , 2024 | 09:50 AM

ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొనే విషయంలో కస్టమర్లు అజాగ్రత్తగా ఉండకూడదు. బంగారం స్వచ్ఛతను క్షుణ్ణంగా తనిఖీ చేసుకున్నాకే కొనుగోలు చేయాలి. కొంతమంది వ్యాపారులు తక్కువ స్వచ్ఛత కలిగిన బంగారాన్ని విక్రయించడానికి ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి మోసాలకు తావివ్వకుండా మీకు మీరే స్వచ్ఛతను పరిశీలించుకోవడం చాలా ఉత్తమం.

Dhanteras 2024: బంగారం కొనాలా.. నాణ్యతను ఈజీగా ఇలా చెక్ చేయండి

ధన త్రయోదశి 2024 (Dhanteras 2024) వచ్చేసింది. హిందువులకు ముఖ్యమైన పర్వదినాల్లో ఒకటైన ఈ పండగ అక్టోబర్ 29న (మంగళవారం) జరగనుంది. పవిత్రమైన ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాదంతా శుభం జరుగుతుందని, ఆరోగ్యం, సిరిసంపదలు నిండుతాయని హిందువులు విశ్వసిస్తుంటారు. ప్రత్యేకమైన ఈ రోజున ధన్వంతరీ, లక్ష్మీ దేవి, వినాయకుడు, కుబేర దేవతలను పూజిస్తుంటారు. బంగారం, వెండి, రాగి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేసి దేవుళ్లను పూజిస్తారు. ముఖ్యంగా బంగారం, వెండి లక్ష్మీదేవికి బాగా ప్రీతికరమైనవి కావడంతో వీటిని కొనుగోలు చేస్తారు.


అయితే ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొనే విషయంలో కస్టమర్లు అజాగ్రత్తగా ఉండకూడదు. బంగారం స్వచ్ఛతను క్షుణ్ణంగా తనిఖీ చేసుకున్నాకే కొనుగోలు చేయాలి. కొంతమంది వ్యాపారులు తక్కువ స్వచ్ఛత కలిగిన బంగారాన్ని విక్రయించడానికి ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి మోసాలకు తావివ్వకుండా మీకు మీరే స్వచ్ఛతను పరిశీలించుకోవడం చాలా ఉత్తమం. అందుకు సులభమైన ఐదు మార్గాలు ఉన్నాయి.


బంగారం స్వచ్ఛతను ఎలా చెక్ చేసుకోవాలంటే..

బీఐఎస్ హాల్‌మార్క్: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం నాణ్యత పరిశీలనలో అత్యంత విశ్వసనీయమైనది. బంగారం స్వచ్ఛతను ఈ మార్క్ నిర్ధారిస్తుంది. హాల్‌మార్క్‌లో క్యారెట్లలో స్వచ్ఛత, స్వర్ణకారుడి గుర్తింపు వంటి సమాచారం ఉంటుంది.

హెచ్‌యూఐడీ నంబర్‌ తనిఖీ: హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాల ప్రతి ముక్కకు ఒక ప్రత్యేకమైన హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నంబర్ ఉంటుంది. గోల్డ్ ప్రామాణికతను నిర్ధారించడంలో ఈ నంబర్ సహాయపడుతుంది. బిస్ కేర్ (BIS App) యాప్‌ని ఉపయోగించి ఈ నంబర్‌ను ధ్రువీకరించుకోవచ్చు. ఆభరణాల స్వచ్ఛత, రిజిస్ట్రేషన్, హాల్‌మార్కింగ్ సెంటర్ వంటి సమాచారాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు.


బీఐఎస్ కేర్ యాప్‌ వాడండి: బంగారం కొనాలనుకునేవారు యాప్ స్టోర్‌లో బీఐఎస్ కేర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా హెచ్‌యూఐడీని గుర్తించవచ్చు. తద్వారా మీరు కొంటున్న బంగారం నిజమైనదా కాదా అని మీరే నిర్ధారించుకోవచ్చు. ఇందులో స్వర్ణకారుడి వివరాలతో పాటు హాల్‌మార్కింగ్ సెంటర్‌కు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది.

క్యారెట్ల స్వచ్ఛత: బంగారు ఆభరణాలు వివిధ రకాల స్వచ్ఛత స్థాయిలలో ఉంటాయి. నాణ్యతను తరచుగా క్యారెట్‌లలో కొలుస్తారు. సాధారణ గ్రేడ్‌లలో 14K, 18k, 22K, 24K లలో కనిపిస్తాయి. సాధారణంగా ధన త్రయోదశి సమయంలో 22 క్యారట్ల బంగారాన్ని ఎక్కువగా కొంటుంటారు. అయితే 24 క్యారెట్ల బంగారం ఎక్కువ నాణ్యత కలిగివుంటుంది.

అయస్కాంత పరీక్ష: బంగారం నాణ్యతను అక్కడికక్కడే వేగంగా గుర్తించేందుకు అయస్కాంతాన్ని ఉపయోగింవచ్చు. నిజమైన బంగారం అయస్కాంతానికి అతుక్కోదు. ఒకవేళ అతుక్కున్నా అటు ఇటు కదలాడినా అది స్వచ్ఛమైనది కాదని అనుమానించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారు బరువు, క్యారెట్, హాల్‌మార్క్ ధృవీకరణతో కూడిన పూర్తి బిల్లును నగల వ్యాపారి నుంచి తీసుకోవాలి. భవిష్యత్తులో అమ్మకాలు లేదా విక్రయాల విషయంలో ఈ బిల్లు ఉపయోగపడుతుంది.


ఇవి కూడా చదవండి

విమాన ప్రయాణంలో శునకం మృతి.. యజమాని ఏం చేశాడంటే

ఐరన్‌మ్యాన్ ఛాలెంజ్ పూర్తి చేసిన బీజేపీ ఎంపీ.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే

For more Viral News and Telugu News

Updated Date - Oct 28 , 2024 | 09:51 AM