ఎగుమతుల్లో భారీ క్షీణత
ABN , Publish Date - Sep 18 , 2024 | 01:31 AM
ప్రపంచ ఆర్థిక అస్థిరతలు ఎగుమతుల రంగాన్ని కుంగదీశాయి. ఆగస్టు నెలలో భారత ఎగుమతులు 9.3 శాతం పడిపోయి 3,471 కోట్ల డాలర్లకే (రూ.2.92 లక్షల కోట్లు) పరిమితమయ్యాయి. ఇది 13 నెలల కనిష్ఠ స్థాయి. ఎగుమతుల భారీ క్షీణత ప్రభావం ...
ఆగస్టులో 9.3 శాతం డౌన్.. 10 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక అస్థిరతలు ఎగుమతుల రంగాన్ని కుంగదీశాయి. ఆగస్టు నెలలో భారత ఎగుమతులు 9.3 శాతం పడిపోయి 3,471 కోట్ల డాలర్లకే (రూ.2.92 లక్షల కోట్లు) పరిమితమయ్యాయి. ఇది 13 నెలల కనిష్ఠ స్థాయి. ఎగుమతుల భారీ క్షీణత ప్రభావం వల్ల వాణిజ్య లోటు 10 నెలల గరిష్ఠ స్థాయి 2,965 కోట్ల డాలర్లకు (రూ.2.49 లక్షల కోట్లు) దూసుకుపోయింది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇదే నెలలో దిగుమతులు 3.3 శాతం పెరిగి రికార్డు గరిష్ఠ స్థాయి 6,436 కోట్ల డాలర్లకు (రూ.5.41 లక్షల కోట్లు) చేరాయి. దిగుమతుల వృద్ధికి బంగారం, వెండి ప్రధాన దోహదకారులుగా ఉన్నాయి.
పెట్రోలియం ధరలు తగ్గడం వల్ల క్రూడాయిల్ దిగుమతుల విలువ 32.38 శాతం తగ్గి 1,100 కోట్ల డాలర్లకు (రూ.92,400 కోట్లు) పరిమితమైంది. అయితే ఏప్రిల్-ఆగస్టు నెలల మధ్య కాలంలో మాత్రం ఎగుమతులు 1.14 శాతం పెరిగి 17,868 కోట్ల డాలర్లుగా (రూ.15 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇదే కాలంలో దిగుమతులు 7 శాతం పెరిగి 29,532 కోట్ల డాలర్లకు (రూ.24.81 లక్షల కోట్లు) చేరాయి. వాణిజ్య లోటు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 9,916 కోట్ల డాలర్ల (రూ.7.49 లక్షల కోట్లు) నుంచి 11,664 కోట్ల డాలర్లకు (రూ.9.80 లక్షల కోట్లు) చేరింది.
పెను సవాలే
ప్రపంచ స్థాయి అస్థిరతలు నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో ఎగుమతులు పెను సవాలు విసురుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ అన్నారు. చైనాలో మందగమనం, యూరోపియన్ యూనియన్ (ఈయూ), అమెరికాల్లో తిరోగమన పరిస్థితులు కొనసాగుతుండడంతో పాటు ఆయిల్ ధరల్లో క్షీణత, రెడ్ సీ (ఎర్ర సముద్రం) సంక్షోభం కారణంగా పెరిగిన రవాణా వ్యయాలు ఎగుమతులను కుంగదీస్తున్నాయని ఆయన చెప్పారు. ఇన్ని సవాళ్లున్నప్పటికీ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో సానుకూల వృద్ధి నమోదు కావడం ఆనందకరమైన విషయమేనన్నారు.
రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు
ఆగస్టు నెలలో బంగారం దిగుమతులు రెట్టింపై రికార్డు గరిష్ఠ స్థాయి 1,006 కోట్ల డాలర్లకు (రూ.84,504 కోట్లు) చేరాయి. వార్షిక ప్రాతిపదికన వెండి దిగుమతులు కూడా 72.7 కోట్ల డాలర్లుగా (రూ.6,106 కోట్లు) నమోదయ్యాయి. కస్టమ్స్ సుంకాలు భారీగా తగ్గించడం, ప్రస్తుత పండగల డిమాండ్ ఈ లోహాల దిగుమతులు భారీగా పెరగడానికి కారణమయ్యాయి. గత ఏడాది ఆగస్టులో బంగారం దిగుమతుల విలువ 493 కోట్ల డాలర్లుగా (రూ.41,412 కోట్లు) ఉంది. మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5 శాతం ఉంది. ఇదిలా ఉండగా ఆగస్టులో ఎలక్ర్టానిక్ వస్తువుల ఎగుమతులు 7.85 శాతం, ఫార్మా ఎగుమతులు 4.67 శాతం, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు 4.36 శాతం పెరిగాయి. ఏప్రిల్-ఆగస్టు నెలల మధ్య కాలంలో మొత్తం సేవల రంగం ఎగుమతుల విలువ 15,018 కోట్ల డాలర్లకు (రూ.12.62 లక్షల కోట్లు) చేరింది.
నాలుగు నెలల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
ఆగస్టు నెలలో టోకు ద్రవ్యోల్బణం 3 నెలల కనిష్ఠ స్థాయి 1.31 శాతానికి తగ్గింది. బంగాళాదుంప, ఉల్లి ధరలు పెరిగినా ఇతర కూరగాయలు, ఇంధనం ధరలు తగ్గడం ఇందుకు దోహదపడింది. ద్రవ్యోల్బణం తగ్గడం వరుసగా ఇది రెండో నెల. జూలైలో ఇది 2.04 శాతం ఉంది. మే నెలలో గరిష్ఠ స్థాయి 3.43 శాతాన్ని తాకిన అనంతరం ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది. గత ఏడాది ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం (-) 0.46 శాతం ఉంది. ఆగస్టు నెలలో ఆహార వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం 3.11 శాతంగా నమోదైంది. ప్రధానంగా కూరగాయల ధరలు 10.01 శాతం తగ్గాయి.