Share News

హైదరాబాద్‌ ఇన్‌ఫ్రా, రియల్టీ అదుర్స్‌

ABN , Publish Date - Nov 20 , 2024 | 03:05 AM

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. పాలనా సౌలభ్యం, ఆర్థిక-సామాజిక పరిస్థితులు, స్థిరాస్తి (రియల్టీ), మౌలిక సదుపాయాలు ఇందుకు కలిసి వస్తున్నాయని....

హైదరాబాద్‌ ఇన్‌ఫ్రా, రియల్టీ అదుర్స్‌

  • శరవేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో అగ్రస్థానం

  • కలిసొస్తున్న మౌలిక సదుపాయాలు

  • లగ్జరీ విల్లాలు, ఇళ్లకు యమ డిమాండ్‌

  • నైౖట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. పాలనా సౌలభ్యం, ఆర్థిక-సామాజిక పరిస్థితులు, స్థిరాస్తి (రియల్టీ), మౌలిక సదుపాయాలు ఇందుకు కలిసి వస్తున్నాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. దీనికి సంబంధించి ఇండియా ప్రైమ్‌ సిటీ ఇండెక్స్‌ పేరుతో నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్‌లో పెరుగుతున్న నయా సంపన్నుల జనాభా కూడా ఇందుకు దోహదం చేస్తోందని ఆ నివేదిక తెలిపింది.

మౌలికమే దన్ను: హైదరాబాద్‌లో ఐటీ, టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే బలంగా వేళ్లూనుకున్నాయి. ఓఆర్‌ఆర్‌, మెట్రో రైల్‌ విస్తరణతో వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత, ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. ప్రభుత్వ సానుకూల విధానాలు ఇందుకు తోడయ్యాయి. దీనికి తోడు ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పోలిస్తే నగరంలో ఇళ్ల ధరలు తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్‌ రియల్టీకి కలిసి వస్తున్నట్టు నగరానికి చెందిన రియల్టీ సంస్థ సుమధుర గ్రూప్‌ సీఎండీ జీ మధుసూధన్‌ చెప్పారు. ఈ మార్పులతో నగరానికి ఐదారు కిలోమీటర్ల దూరమైనా పెద్ద సైజు అపార్ట్‌మెంట్‌, విల్లా వంటి లగ్జరీ ఇళ్లను కొనేందుకు నగరవాసులు వెనకాడడం లేదని మరో రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రణీత్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ నరేంద్ర కుమార్‌ కామరాజు తెలిపారు.


కొత్త ట్రెండ్‌ : గతంలో నయా కుబేరులు మాత్రమే విశాలమైన ఖరీదైన ఫ్లాట్లు, బంగళాలు కొనేవారు. కొవిడ్‌ తర్వాత ట్రెండ్‌ మారింది. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉన్న ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా ఇప్పుడు ఈ తరహా నివాస గృహాల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. చుట్టుపక్కల మంచి గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణమూ ఈ విషయంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్‌, కోకాపేట్‌, నియోపోలిస్‌, రాయదుర్గం, బాచుపల్లి ప్రాంతాల్లో నిర్మిస్తున్న లగ్జరీ విల్లాలు, ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ డిమాండ్‌తో శివారు ప్రాంతాల్లోని భూముల ధర చుక్కలంటుతోంది. ఆ ప్రభావం లగ్జరీ ఇళ్ల ధరలపైనా కనిపిస్తోందని నగరానికి చెందిన పౌలోమీ ఎస్టేట్స్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ రావు చెప్పారు. దీంతో గత ఏడాది నగరంలో నివాస గృహాల ధరలు 11 శాతం పెరిగినట్టు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది.


రెండో స్థానంలో బెంగళూరు: హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు,ముంబై-మెట్రోపాలిటన్‌ ప్రాంతం రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్టు నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది. నిపుణులైన ఉద్యోగుల లభ్యత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన సానుకూల వ్యాపార విఽధానాలు, ఆర్థిక సామాజిక పరిస్థితులు బెంగళూరుకు ప్రధానంగా కలిసి వస్తున్నట్లు నైట్‌ఫ్రాంక్‌ ఇండియా ఈడీ గులాం జియా చెప్పారు.

తగ్గిన ఆఫీస్‌ స్పేస్‌ సరఫరా : కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్‌ ఉన్నా.. హైదరాబాద్‌లో కొత్త కార్యాలయ భవనాల అందుబాటు మాత్రం పెద్దగా లేదు. సెప్టెంబరు త్రైమాసికంలో నగరంలో ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ 25 శాతం పెరిగినా 41 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ కొత్త కార్యాలయ స్థలం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ వెస్టియన్‌ తెలిపింది.

Updated Date - Nov 20 , 2024 | 03:05 AM