యూనికార్న్‌లలో భారత్ నం.3
ABN , Publish Date - Apr 10 , 2024 | 02:05 AM
ప్రపంచంలో అత్యధిక యూనికార్న్‌లు కలిగిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది చివరినాటికి దేశంలోని యూనికార్న్‌ల నికర సంఖ్య 67గా నమోదైందని ‘హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024’ వెల్లడించింది...
2023 చివరినాటికి దేశంలో 67 యూనికార్న్‌లు
అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే తగ్గిన సంఖ్య
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక యూనికార్న్‌లు కలిగిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది చివరినాటికి దేశంలోని యూనికార్న్‌ల నికర సంఖ్య 67గా నమోదైందని ‘హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024’ వెల్లడించింది. 703 యూనికార్న్‌లతో అమెరికా అగ్రస్థానంలో ఉండ గా.. చైనా (340 యూనికార్న్‌లు) రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత్ తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్ (53), జర్మనీ (36) వరుసగా 4, 5 స్థానా ల్లో నిలిచాయి. కనీసం బిలియన్ డాలర్ల (రూ.8,300 కోట్లు) మార్కెట్ విలువ కలిగిన స్టార్ట్‌పను యూనికార్న్‌గా పిలుస్తారు. ప్రపంచ యూనికార్న్‌ల మొత్తం మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది గత ఏడాది జపాన్ జీడీపీతో సమానం. నివేదిక ముఖ్యాంశాలు..
2022లో దేశంలో 68 యూనికార్న్‌లుండగా.. 2023లో సంఖ్య 67 తగ్గింది. 2017 నుంచి హురున్ ప్రపంచ యూనికార్న్‌ల సూచీని విడుదల చేస్తూ వస్తోంది. అప్పటి నుంచి భారత్‌లో వీటి సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ అనిశ్చితులు, ఆర్థిక మందగమనం నేపథ్యంలో స్టార్ట్‌పల రంగంలోకి పెట్టుబడులు భారీగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణం.
భారతీయులు స్వదేశంలో కంటే విదేశాల్లోనే అధిక యూనికార్న్‌లను ఏర్పాటు చేయగలిగారు. భారతీయులు సహ వ్యవస్థాపకులుగా ఉన్న స్టార్ట్‌పలలో ఇప్పటికే 109 యూనికార్న్ హోదాను సాధించాయి. అందులో 95 అమెరికాలోనే ఉన్నాయి.
అత్యధిక యూనికార్న్‌లకు వేదికైన ప్రపంచ నగరాల జాబితాలో బెంగళూరు 6 నుంచి 7 స్థానానికి జారుకుంది. దేశంలోని 67 యూనికార్న్‌లలో 32 బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిసున్నాయి. కాగా, 14 యూనికార్న్‌లతో ముంబై 20 నుంచి 19వ స్థానానికి ఎగబాకింది.
దేశంలో అతిపెద్ద ఎడ్యుటెక్ స్టార్టప్ బైజూ్‌సతోపాటు ఫార్మ్‌ఈజీ మార్కెట్ విలువ భారీ క్షీణత కారణంగా ఈ సారి యూనికార్న్‌ల జాబితాలో స్థానం కోల్పోయాయి.
చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ 22,000 కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన యూనికార్న్ గా నిలిచింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (18,000 కోట్ల డాలర్లు) రెండో స్థానంలో ఉంది. కాగా, జనరేటివ్ ఏఐ అప్లికేషన్ ‘చాట్‌జీపీటీ’ని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ 10,000 కోట్ల డాలర్ల మార్కెట్ వేల్యూతో మూడో స్థానానికి ఎగబాకింది.
ప్రపంచంలోని అత్యంత విలువైన 100 యూనికార్న్‌లలో భారత్ నుంచి స్విగ్గీ (83వ స్థానం), డ్రీమ్11 (83), రేజర్‌పే (94), ఓలా (100) ఉన్నాయి.