Share News

ఇన్ఫీ లాభం రూ.6,368 కోట్లు

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:25 AM

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.6,368 కోట్లకు చేరుకుంది...

ఇన్ఫీ లాభం రూ.6,368 కోట్లు

2024-25 ఆదాయ అంచనా 3-4 శాతానికి పెంచిన సంస్థ

ఈసారి 20,000 వరకు ఫ్రెషర్ల నియామకాలు

బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.6,368 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇదే కాలానికి నమోదైన రూ.5,945 కోట్ల లాభంతో పోలిస్తే 7.1 శాతం వృద్ధి నమోదైంది. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్జించిన రూ.7,969 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 20.1 శాతం క్షీణించింది. కాగా, ఈ క్యూ1లో కంపెనీకి కార్యకలాపాల ద్వారా సమకూరిన ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.6 శాతం వృద్ధితో రూ.39,315 కోట్లకు పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయ వృద్ధి అంచనాను కంపెనీ గతంలో ప్రకటించిన 1-3 శాతం నుంచి 3-4 శాతానికి పెంచింది. నిర్వహణ లాభాల మార్జిన్‌ అంచనాను మాత్రం యథాతథంగా 20-22 శాతంగా కొనసాగించింది. క్యూ1 నిర్వహణ మార్జిన్‌ 21.1 శాతంగా నమోదైంది.


‘‘బలమైన, విస్తృత స్థాయి వృద్ధి, మెరుగైన నిర్వహణ మార్జిన్‌, సమృద్ధికరమైన డీల్స్‌, అత్యధిక నగదు సృష్టితో ఈ ఆర్థిక సంవత్సరానికి అద్భుతమైన ప్రారంభం లభించింది. మా వైవిధ్య సేవలు, క్లయింట్లకు మాపైన అపార నమ్మకం, నిర్విరామ కృషికిదే సాక్ష్య’’మని ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌ అన్నారు.

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయమేదైనా మద్దతిస్తాం

ఉద్యోగ నియామకాలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఏ నిబంధనలు లేదా మార్గదర్శకాలు ప్రవేశపెట్టినా మా కంపెనీ అందుకు లోబడి ఉంటుందని ఇన్ఫీ చీఫ్‌ సలీల్‌ పరేఖ్‌ స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మేం కార్యకలాపాలు సాగిస్తాం. ప్రభుత్వాలు ఏ నియమ, నిబంధనలు తీసుకొచ్చినా మేం మద్దతిస్తా’’మని పేర్కొన్నారు.


మరిన్ని ముఖ్యాంశాలు..

  • ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ 410 కోట్ల డాలర్ల విలువైన భారీ డీల్స్‌ను దక్కించుకుంది. అయితే, మార్కెట్‌ అంచనా 500 కోట్ల డాలర్ల కంటే తక్కువిది. అంతేకాదు, ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో లభించిన 450 కోట్ల డాలర్ల భారీ డీల్స్‌తో పోల్చినా తగ్గింది.

  • ఇన్ఫీ అతిపెద్ద ఆదాయ వనరు అయిన ఆర్థిక సేవల రంగం నుంచి రాబడి ఈ క్యూ1లో 0.3 శాతం తగ్గి 27.5 శాతానికి పరిమితమైంది. రిటైల్‌ రంగ ఆదాయం వాటా కూడా 3 శాతం తగ్గి 13.8 శాతానికి జారుకుంది

  • ఐటీ రంగానికి అతిపెద్ద మార్కెట్‌ అయిన ఉత్తర అమెరికా నుంచి ఆదాయం 1.2 శాతం తగ్గగా.. యూరప్‌ మార్కెట్‌ నుంచి రాబడి 9.1 శాతం పెరిగింది. ఇండియా మార్కెట్‌ రెవెన్యూ 19.9 శాతం వృద్ధి చెందగా.. మిగతా ప్రాంతాల నుంచి ఆదాయం 2.3 శాతం పెరిగింది.

  • ఈ మార్చి త్రైమాసికం చివరి నాటితో పోలిస్తే, గడిచిన మూడు నెలల్లో ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల సంఖ్య నికరంగా 1,908 తగ్గి 3,15,332కు పరిమితమైంది. ఏడాది క్రితం స్థాయితో పోలిస్తే ఉద్యోగులు 6 శాతం తగ్గారు. వరుసగా ఆరు త్రైమాసికాలుగా కంపెనీ ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.


  • ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు 12.7 శాతానికి పెరిగింది. మార్చితో ముగిసిన క్వార్టర్‌లో అట్రిషన్‌ రేటు 12.6 శాతంగా ఉంది.

  • ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరానుగుణంగా 15,000-20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జయేష్‌ సంఘ్రజ్క తెలిపారు.

Updated Date - Jul 19 , 2024 | 03:25 AM