Share News

2030 నాటికి ఇన్‌ఫ్రాలోకి రూ.187 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Dec 13 , 2024 | 02:40 AM

భారత్‌ 2030 నాటికి 7 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఒక నివేదికలో...

2030 నాటికి ఇన్‌ఫ్రాలోకి రూ.187 లక్షల కోట్ల పెట్టుబడులు

నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా

న్యూఢిల్లీ: భారత్‌ 2030 నాటికి 7 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ఈ మొత్తం ఎంతలేదన్నా 2.2 లక్షల కోట్ల డాలర్లు (ప్రస్తుత మారకం రేటు ప్రకారం సుమారు రూ.186.56 లక్షల కోట్లు) వరకు ఉంటుందని అంచనా. భారీ సంస్కరణల ద్వారా పెద్ద ఎత్తున ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించడం ఒక్కటే ఇందుకు మార్గమని స్పష్టం చేసింది. మన ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి ఏడు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకువెళ్లేందుకు 2024-30 మధ్య కాలంలో మన జీడీపీ ఏటా సగటున 10.1 శాతం చొప్పున వృద్ధి చెందడం అవసరమని స్పష్టం చేసింది. మౌలిక రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులు పెరిగితే ప్రభుత్వాల ద్రవ్యలోటూ తగ్గుతుందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది.


విమానాశ్రయాల కోసం రూ.60,000 కోట్లు

విమానాశ్రయాల అబివృద్ధి కోసం భారత్‌ వచ్చే మూడేళ్లలో పెద్ద మొత్తం ఖర్చు చేయక తప్పేలా లేదు. ఇందుకోసం ఎంత లేదన్నా రూ.60,000 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుదని క్రిసిల్‌ అంచనా. 2027 నాటికి ఏటా 6.5 కోట్ల విమాన ప్రయాణికుల సామర్ధ్యం కోసం ఈ పెట్టుబడులు తప్పవని తెలిపింది.


టాప్‌గేర్‌లో ఆటోమొబైల్‌ విడిభాగాల పరిశ్రమ

దేశంలో ఆటోమొబైల్‌ విడి భాగాల పరిశ్రమ టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి ఆరు నెలల్లో ఈ పరిశ్రమ రూ.3.32 లక్షల కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువని ఈ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే ఆటోమొబైల్‌ కాంపోనెంట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఏసీఎంఏ) తెలిపింది. అంతర్జాతీయ ఆటుపోట్లతో ఎగుమతుల వృద్ది సన్నగిల్లినా పరిశ్రమ ఈ అభివృద్ధి నమోదు చేసిందని ఏసీఎంఏ జాతీయ అధ్యక్షుడు శ్రద్ధా సూరి మార్వా చెప్పారు.

Updated Date - Dec 13 , 2024 | 02:40 AM