SEBI : దృశ్య-శ్రవణ రూపంలో ఐపీఓ సమాచారం
ABN , Publish Date - May 25 , 2024 | 05:53 AM
పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లకు సంబంధించి క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఐపీఓకు రావాలనుకునే కంపెనీలు సెబీకి సమర్పించే పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ, ఆర్‌హెచ్‌పీ), ఇష్యూ
కొత్త పద్ధతిని ప్రవేశపెట్టిన సెబీ
జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఐచ్ఛికం
అక్టోబరు 1 నుంచి తప్పనిసరి
న్యూఢిల్లీ: పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లకు సంబంధించి క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఐపీఓకు రావాలనుకునే కంపెనీలు సెబీకి సమర్పించే పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ, ఆర్‌హెచ్‌పీ), ఇష్యూ ధరల శ్రేణి ప్రకటనలోని కీలక సమాచారాన్ని దృశ్య-శ్రవణ రూపంలోనూ పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. దాదాపు 10 నిమిషాల నిడివితో కూడిన ఆడియో విజువల్ (ఏవీ) ఫైల్స్‌ను ఆంగ్లం, హిందీ భాషల్లో విడివిడిగా రూపొందించాల్సి ఉంటుంది. ఐపీఓలో పెట్టుబడులు పెట్టేవారు ఆ కంపెనీ ఆఫర్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని మరింత సులభంగా అర్ధం చేసుకునేందుకు ఇది దోహపడనుంది. ఐపీఓ ద్వారా షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లోని ప్రధాన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయాలనుకునే కంపెనీలకు ఇది వర్తిస్తుందని శుక్రవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో సెబీ వెల్లడించింది. ఈ జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు డీఆర్‌హెచ్‌పీ సమర్పించే కంపెనీలకు ఇది ఐచ్ఛికమని, అక్టోబరు 1 నుంచి తప్పనిసరని మార్కెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది.
డెరివేటివ్ సెగ్మెంట్లో షేర్ల ధరల శ్రేణి నిబంధనల మార్పు
డెరివేటివ్ మార్కెట్లో ఊగిసలాటలతో పాటు సమాచార అసమానతను తగ్గించేందుకు షేర్ల నిర్వహణ ధరల శ్రేణి (ఆపరేటింగ్ ప్రైస్ బ్యాండ్ లేదా డైనమిక్ ప్రైస్ బ్యాండ్) నిబంధనలను సెబీ మార్చింది. ధరల శ్రేణి అవసరం లేని షేర్లకు నిర్వహణ ధరల శ్రేణిని స్టాక్ ఎక్స్ఛేంజీలే అమలు చేస్తాయి. ప్రస్తుతం క్యాష్ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ట్రేడింగ్ గత సెషన్ ముగింపు ధరకు +/- 10 శాతం ధర శ్రేణితో ప్రారంభమవుతుంది.