Jio Financial Services: మరో మైలు రాయిని దాటిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్.. రూ.2 లక్షల కోట్లు దాటిన మార్కెట్ క్యాప్
ABN , Publish Date - Feb 23 , 2024 | 04:11 PM
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటల్ రూ.2 లక్షల కోట్లను దాటేసింది.
దిగ్గజ రిలయన్స్ (Reliance) ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (Jio Financial Services) అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటల్ రూ.2 లక్షల కోట్లను (Jio Financial Services mcap) దాటేసింది. గత ఐదు రోజుల్లో ఈ సంస్థ షేర్లు 17 శాతానికి పైగా పెరిగి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. శుక్రవారం జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ షేర్ ధర ఒక దశలో ఏకంగా రూ.347కు చేరి జీవన కాల గరిష్టాన్ని తాకింది. చివరకు 333.95 వద్ద రోజును ముగించింది. ఈ ఏడాది జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ 41 శాతం రిటర్న్స్ అందించింది.
డిసెంబర్ త్రైమాసికంలో జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ రూ.293 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికానికి మొత్తం ఆదాయం రూ.413 కోట్లుగా ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. కాగా, జియో ఫైనాన్సియల్ మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా లాభాల్లోనే కదలాడుతున్నాయి. రిలయన్స్ మార్కెట్ క్యాపిటల్ ఏకంగా రూ.20 లక్షల కోట్లు దాటి భారత్‌లో నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. రిలయన్స్ తర్వాతి స్థానంలో టీసీఎస్ (రూ.14.78 లక్షల కోట్లు) ఉంది. కాగా, దేశీయ స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ దాటిన కంపెనీలు 13 ఉన్నాయి.