కిమ్స్ హాస్పిటల్స్ ఆదాయం రూ.782 కోట్లు
ABN , Publish Date - Nov 10 , 2024 | 01:48 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హస్పిటల్స్).. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.782 కోట్ల రెవెన్యూపై రూ.121 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హస్పిటల్స్).. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.782 కోట్ల రెవెన్యూపై రూ.121 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రెవెన్యూ 655 కోట్లు ఉండగా లాభం రూ.101 కోట్లుగా ఉంది. సెప్టెంబరు త్రైమాసికంలో మహారాష్ట్రలోని నాసిక్ హాస్పిటల్ అందుబాటులోకి రాగా కేరళలోని కన్నూర్‌లో తొలి హాస్పిటల్‌ను ప్రారంభించినట్లు కిమ్స్ హాస్పిటల్స్ సీఎండీ బీ భాస్కర్ రావు తెలిపారు. అందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావటంపై ప్రధానంగా దృష్టి సారించామని, అందుకు తగ్గట్టుగానే తాము ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు.
గుంటూరులోనూ కిమ్స్: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోకి కిమ్స్ హాస్పిటల్స్ అడుగుపెడుతోంది. గుంటూరుకి చెందిన ఇన్‌సిగ్నియా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా హాస్పిటల్ కార్యకలాపాలు, మేనేజ్‌మెంట్ బాధ్యతలను కిమ్స్ చేపట్టనుంది. కిమ్స్ శిఖర పేరుతో ఈ హాస్పిటల్‌ను నిర్వహించనుంది. ఇన్‌సిగ్నియా 150 పడకలతో ఈ హాస్పిటల్‌ను నిర్వహిస్తోంది. ఈ హాస్పిటల్‌ను 200 పడకలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.