LIC Housing Finance: భద్రతా బలగాల్లో పనిచేస్తున్నవారికి ఎల్‌ఐసీ గుడ్‌న్యూస్
ABN , Publish Date - Aug 19 , 2024 | 01:36 PM
ప్రైవేటు రంగ కంపెనీలకు ధీటైన ఆఫర్లు ప్రకటించే ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LIC Housing Finance) దేశాన్ని సదా కాపాడే రక్షణ రంగ సిబ్బందికి గుడ్‌న్యూస్. అదిరిపోయే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. భారత భద్రతా దళాల్లో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రవేశపెట్టింది.
ప్రైవేటు రంగ కంపెనీలకు ధీటైన ఆఫర్లు ప్రకటించే ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LIC Housing Finance) దేశాన్ని సదా కాపాడే రక్షణ రంగ సిబ్బందికి గుడ్‌న్యూస్. అదిరిపోయే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. భారత భద్రతా దళాల్లో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రవేశపెట్టింది. ఈ పథకం పేరు ‘గృహ రక్షక్’. అర్హత కలిగిన వారికి కేవలం 8.4 శాతం వడ్డీ రేటుకే రూ.2 కోట్ల వరకు గృహ రుణాలను అందించనున్నట్టు సంస్థ ప్రకటించింది. క్రెడిట్ స్కోరు 750, అంతకంటే ఎక్కువ ఉన్నవారు ఈ స్కీమ్‌కు అర్హులు అవుతారని, వార్షిక వడ్డీ 8.4 శాతంగా ఉంటుందని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వివరించింది.
మరో ప్రయోజకరమైన విషయం ఏంటంటే.. పరిమిత కాల ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజులను కూడా మాఫీ చేస్తున్నట్టు వెల్లడించింది. భద్రతా బలగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులే కాకుండా రిటైర్డ్ అధికారులు సైతం ఈ ఆఫర్ కింద రుణం పొందొచ్చునని ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వివరించింది. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. సాయుధ బలగాల సిబ్బందికి ప్రత్యేక రేట్లపై గృహ రుణాలను అందించడం తమకు గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో త్రిభువన్ వ్యాఖ్యానించారు. నిస్వార్థంగా దేశం స్వేచ్ఛ, భద్రత కోసం అనునిత్యం పాటుపడుతున్న సాయుధ బలగాలకు కృతజ్ఞతలు తెలిపే మార్గంగా ఈ ప్రత్యేక పథకాన్ని ఆవిష్కరించామని ఆయన చెప్పారు.
‘గృహ రక్షక్’ స్కీమ్ సాయుధ దళాలకు తమ హృదయపూర్వక నివాళిగా నిలుస్తుందని, ఆదర్శవంతమైన విషయాల్లో తమ నిబద్ధతకు గుర్తింపుగా ఉంటుందని త్రిభువన్ పేర్కొన్నారు. కాగా ‘గృహ రక్షక్’ పరిమితి కాలపు ఆఫర్. ఒక నెల 14 రోజులు మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
సెప్టెంబర్ 30, 2024 వరకు దాదాపు అందుబాటులో ఉండే ఈ పథకం కోసం భద్రతా బలగాల్లో పనిచేసే సిబ్బంది దరఖాస్తు చేసుకోవచ్చు.