అదానీ సుడిలో మార్కెట్ మునక
ABN , Publish Date - Nov 22 , 2024 | 05:54 AM
గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం అభియోగాలు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూప్‌లోని 11 లిస్టెడ్ కంపెనీల షేర్లు గురువారం కుప్పకూలాయి. గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ఏకంగా 22.61 శాతం క్షీణించగా.
ఈక్విటీ మార్కెట్ నష్టం రూ.5.27 లక్షల కోట్లు.. అదానీ గ్రూప్ వాటా రూ.2.24 లక్షల కోట్లు
కుప్పకూలిన అదానీ షేర్లు
అదానీ ఎంటర్‌ప్రైజెస్ నష్టం 23ు
మరో 10 కంపెనీల షేర్లదీ అదే గతి
హిండెన్‌బర్గ్ వివాదం తర్వాత ఇదే అతిపెద్ద ఫాల్
ముంబై: గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం అభియోగాలు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూప్‌లోని 11 లిస్టెడ్ కంపెనీల షేర్లు గురువారం కుప్పకూలాయి. గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ఏకంగా 22.61 శాతం క్షీణించగా.. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 18.80 శాతం పతనమయ్యాయి. పలు కంపెనీల షేర్లు ఇంట్రాడేలో లోయర్ సర్క్యూట్‌ను సైతం తాకాయి. అమ్మకాల హోరులో అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ సంపద ఒక్కరోజే రూ.2.24 లక్షల కోట్లు తగ్గి రూ.12.06 లక్షల కోట్ల స్థాయికి పడిపోయింది. 2023 జనవరిలో అదానీ అవకతవకలపై హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేసినప్పుడు తరిగిపోయిన గ్రూప్ సంపదతో పోలిస్తే ఇది రెండు రెట్లకు పైగా అధికం. అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ ఏడాది గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు రూ.7.5 లక్షల కోట్ల మేర తరిగిపోయింది. తాజా వివాదం నేపథ్యంలో అదానీ గ్రూప్ స్టాక్స్ మున్ముందు మరింత క్షీణించే అవకాశాలున్నాయని, రిటైల్ మదుపరులు కొంతకాలం పాటు ఈ షేర్లకు దూరంగా ఉండటమే మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
రూ.లక్ష కోట్లు తగ్గిన
అదానీ వ్యక్తిగత సంపద
గ్రూప్ కంపెనీల షేర్ల పతనంతో గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా క్షీణించింది. ఫోర్బ్స్ బిలియనీర్ల రియల్‌టైం జాబితా ప్రకారం.. అదానీ ఆస్తి ఏకంగా 17.34 శాతం లేదా 1,210 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.02 లక్షల కోట్లు)తగ్గి 5,770 కోట్ల డాలర్లకు (రూ.4.87 లక్షల కోట్లు) పడిపోయింది. దాంతో అదానీ రిచ్ లిస్ట్‌లో 25వ స్థానానికి జారుకున్నారు.
జీక్యూజీ రాజీవ్ జైన్‌కూ షాక్!
హిండెన్‌బర్గ్ వివాదం అనంతర కాలంలో అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీగా వాటాలు కొనుగోలు చేసిన ప్రవాస భారతీయుడు రాజీవ్ జైన్‌కు చెందిన జీక్యూజీ పార్ట్‌నర్స్‌కూ తాజా ఆరోపణలతో గట్టి షాక్ తగిలింది. అదానీ కంపెనీల్లోని జీక్యూజీ పెట్టుబడుల విలువ భారీగా తరిగిపోవడంతో పాటు ఆస్ట్రేలియాలోని ఏఎ్‌సఎక్స్‌లో లిస్టయిన జీక్యూజీ షేరు గురువారం ఉదయం 26 శాతం పతనమైంది.
గ్రూప్ పరపతికి దెబ్బ: మూడీస్
అమెరికాలో గౌతమ్ అదానీపై లంచం కేసు నమోదు కావడం గ్రూప్ కంపెనీల పరపతిని దెబ్బతీయనుందని అంతర్జాతీయ సంస్థ మూడీస్ రేటింగ్స్ అంటోంది. ఈ నేపథ్యంలో అదానీ కంపెనీల పరపతి సామర్థ్యాన్ని మదించేందుకు గ్రూప్ పాలన ప్రమాణాలను సైతం దృష్టిలో పెట్టుకోనున్నట్లు రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది.
అదానీ గ్రీన్ 5,070 కోట్ల
బాండ్ల జారీ రద్దు
తాజా పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్‌నకు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 60 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,070 కోట్లు) విలువైన బాండ్ల జారీ ప్రక్రియను రద్దు చేసుకుంది. అదానీపై అభియోగాలు నమోదైన కొద్ది గంటలకు ముందు యూఎస్ మార్కెట్లో కంపెనీ 20 ఏళ్ల కాలపరిమితితో కూడిన గ్రీన్ బాండ్లను విక్రయించింది. ఇన్వెస్టర్ల నుంచి కూడా భారీ స్పందన లభించింది. ఇష్యూ సైజుకు 3 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ లభించింది. కానీ, తాజా ఆరోపణల నేపథ్యంలో బాండ్ల ఇష్యూను రద్దు చేసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.
423 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలడంతో స్టాక్ మార్కెట్ సూచీలు కూడా కుదేలయ్యాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్‌ను మరింత కుంగదీశాయి. సెన్సెక్స్ ఒకదశలో 775.65 పాయింట్లు పతనమై 76,802.73 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 422.59 పాయింట్ల నష్టంతో 77,155.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 168.60 పాయింట్లు కోల్పోయి 23,349.90 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.27 లక్షల కోట్లు తగ్గి రూ.425.39 లక్షల కోట్లకు (5.04 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. అందులో రూ.2.24 లక్షల కోట్ల సంపద తరుగుదల అదానీ గ్రూప్ కంపెనీలదే కావడం గమనార్హం. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 19 నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ షేరు 13.53 శాతం క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది.
ఎల్‌ఐసీకి 8,700 కోట్ల నష్టం
అదానీ షేర్ల పతనంతో ఈ గ్రూప్ కంపెనీల్లో పెద్దమొత్తంలో పెట్టుబడులు కలిగి ఉన్న ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కూడా భారీగా నష్టపోవాల్సి వచ్చింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ సహా గ్రూప్‌లోని ఏడు కంపెనీల షేర్లలో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ ఒక్కరోజే రూ.8,683 కోట్లు తరిగిపోయింది.
కంపెనీ నష్టం(రూ.కోట్లు)
అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2,962
అదానీ పోర్ట్స్ 2,959
అదానీ గ్రీన్ ఎనర్జీ 570
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 716
అదానీ టోటల్ గ్యాస్ 463
అంబుజా సిమెంట్స్ 191
ఏసీసీ 822