ఫెడ్ షాక్‌కు మార్కెట్లు కుదేలు
ABN , Publish Date - Dec 20 , 2024 | 05:45 AM
వచ్చే ఏడాది వడ్డీ రేట్ల కోత కేవలం రెండు విడతల్లోనే ఉంటుందని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ చేసిన వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపివేసింది. భారత ఈక్విటీ, బులియన్, ఫారెక్స్ మార్కెట్లు...
తొలిసారి 85 కన్నా దిగజారిన రూపాయి
బులియన్‌దీ అదే దారి
80,000 దిగువకు సెన్సెక్స్
ముంబై: వచ్చే ఏడాది వడ్డీ రేట్ల కోత కేవలం రెండు విడతల్లోనే ఉంటుందని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ చేసిన వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపివేసింది. భారత ఈక్విటీ, బులియన్, ఫారెక్స్ మార్కెట్లు కూడా అదే ధోరణిలో స్పందించి తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తొలిసారిగా 85 కన్నా దిగజారి మరో రికార్డు కనిష్ఠానికి పడిపోయింది.
సెన్సెక్స్ 965 పాయింట్లు డౌన్
ఈక్విటీ మార్కెట్ ఫెడ్ ప్రభావానికి తీవ్రంగా లోనయింది. భారీ అమ్మకాల ఒత్తిడి, విదేశీ నిధుల తరలింపుతో కన్స్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఐటీ షేర్లు భారీ నష్టాలు నమోదు చేశాయి. వరుసగా నాలుగో రోజు కూడా నేలచూపులే చూసిన ఈక్విటీ సూచీలు మానసిక అవధులు 80,000 (సెన్సెక్స్), 24,000 (నిఫ్టీ) కన్నా దిగువనే ముగిశాయి. సెన్సెక్స్ 964.15 పాయింట్ల నష్టంతో 79,218.05 వద్ద, నిఫ్టీ 247.15 పాయింట్ల నష్టంతో 23,951.70 వద్ద క్లోజయ్యాయి. నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 2915.07 పాయింట్లు, నిఫ్టీ 816.60 పాయింట్లు నష్టపోయాయి.
రూ.9.65 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఈక్విటీ మార్కెట్ల భారీ పతనంతో నాలుగు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.9.65 లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది. బీఎ్‌సఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.9,65,935.96 కోట్ల మేరకు దిగజారి రూ.4,49,76,402.63 కోట్లకు (5.29 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో సన్ ఫార్మా, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్ మినహా మిగతా 27 కంపెనీలు భారీగా నష్టపోయాయి.
బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 0.30 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.28 శాతం నష్టపోయాయి. రంగాలవారీ సూచీల్లో కూడా ఒక్క హెల్త్‌కేర్ సూచీ మినహా మిగతా అన్ని సూచీలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.
దిగజారిన బంగారం, వెండి ధరలు
ఫెడ్ షాక్‌కు బులియన్ మార్కెట్ కూడా ప్రభావితం అయింది. ఢిల్లీ మార్కెట్లో మేలిమి బంగారం (99.9 స్వచ్ఛత) ధర 10 గ్రాములు రూ.800 దిగజారి రూ.78,300 పలికింది. ఆభరణాల బంగారం (99.5 శాతం స్వచ్ఛత) ధర సైతం అంతే మొత్తంలో తగ్గి రూ.77,900కి దిగజారింది. వెండి ధర కూడా కిలో రూ.2,000 దిగజారి రూ.90,000 పలికింది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.710 దిగజారి రూ.77,130 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1280 దిగజారి రూ.70,070 వద్ద నిలిచాయి. కిలో వెండి ధర రూ.1,000 తగ్గి రూ.99,000 పలికింది.
జీవితకాల కనిష్ఠానికి రూపాయి
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి జీవితకాల కనిష్ఠానికి దిగజారింది. గురువారం ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి 19 పైసలు దిగజారి 85.13 వద్ద స్థిరపడింది. రూపాయి 85 స్థాయి కన్నా దిగజారడం ఇదే ప్రథమం. ట్రేడింగ్ ప్రారంభంలోనే 85 కన్నా దిగువన ప్రారంభమైన రూపాయి రోజంతా అదే ధోరణిని కొనసాగిస్తూ కనిష్ఠ స్థాయి 85.14ని తాకింది. అమెరికన్ ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పోవెల్ వడ్డీ రేట్ల విషయంలో ప్రకటించిన కఠిన వైఖరితో డాలర్ విలువ పరుగు తీయడం వర్ధమాన మార్కెట్ల కరెన్సీలపై ఒత్తిడిని పెంచాయి. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్ల నష్టాలు, దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ రూపాయి క్షీణతకు ఆజ్యం పోశాయి.
నెల రోజుల్లోనే ఎన్‌ఎఫ్‌ఓల నిధుల పెట్టుబడి
మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎ్‌ఫ)కు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఫండ్ ఆఫర్స్ (ఎన్‌ఎ్‌ఫఓ) ద్వారా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీ) సేకరించే నిధులను ఆ ఫండ్ నిబందనలకు అనుగుణంగా నెల రోజుల్లో పెట్టుబడులు పూర్తి చేయాలని కోరింది. లేకపోతే ఎగ్జిట్ చార్జీలు లేకుండా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే స్వేచ్ఛ మదుపరులకు కల్పించింది. ఇటీవల మార్కెట్‌కు వస్తున్న ఎన్‌ఎ్‌ఫఓల ద్వారా ఎంఎ్‌ఫలు పెద్ద మొత్తంలో నిధులు సమీకరిస్తున్నాయి. అయితే ఫండ్ మేనేజర్లు ఆ నిధులను నిర్ణీత గడువులోగా, పథకం లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టలేక పోతున్నారు. దీనివల్ల మదుపరులు నష్టపోతున్నారు. దీంతో సెబీ ఈ చర్య తీసుకుంది.
వచ్చే ఏడాదిపై భారీ అంచనాలు వద్దు
కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన బుల్‌రన్ సాధిస్తూ వచ్చిన ఈక్విటీ మార్కెట్‌పై 2025 సంవత్సరానికి భారీ ఆశలు పెట్టుకోవద్దని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్ ఇన్వెస్టర్లకు సూచించింది. ప్రస్తుతం 23,951.70 వద్ద నిఫ్టీ వచ్చే ఏడాది చివరికి 26,482 పాయింట్ల వద్ద స్థిరపడవచ్చని అంచనా వేసింది. అయితే ఇతర సాధనాలతో పోల్చితే ఈక్విటీ మార్కెట్ మెరుగైన ఫలితాలనే సాధిస్తుందని కంపెనీ ఎండీ, సీఈఓ ధీరజ్ రెల్లి అన్నారు. భారత దీర్ఘకాలిక వృద్ధిగాథ యథాతథంగానే ఉన్నదని అభిప్రాయపడ్డారు. ‘‘ఈక్విటీ మార్కెట్ గత కొన్నేళ్లుగా అద్భుతమైన రాబడులు అందించింది. కాని 2025లో ఒక మోస్తరు రాబడులకే ఇన్వెస్టర్లు సిద్ధం కావాలి’’ అని ఆయన సూచించారు. 2024లో ఇప్పటివరకు నిఫ్టీ 10.22 శాతం లాభపడింది. 2020 తర్వాత మార్కెట్లో ప్రవేశించిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో భారీ కరెక్షన్ ఏదీ చవి చూడలేదన్నారు. ప్రస్తుత వాతావరణంలో మిడ్‌క్యా్‌పలు, స్మాల్‌క్యా్‌పల కన్నా లార్జ్‌క్యా్‌పల పైనే దృష్టి సారించాలని, పెట్టుబడిలో 67 శాతం పెద్ద కంపెనీల షేర్ల కొనుగోలుకే కేటాయించాలని సూచించారు.
గత రెండు మూడేళ్లుగా 80 శాతం స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లకు మెరుగైన లాభాలందించాయని, కొత్త సంవత్సరంలో అలాంటి కంపెనీల సంఖ్య 20 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయాల వృద్ధి 4 శాతం నుంచి 17 శాతానికి పెరగవచ్చని సూచించారు. వచ్చే ఏడాదికి తాము పెద్ద బ్యాంకులు, అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు, యంత్రపరికరాలు, సిమెంట్, భవన నిర్మాణ సామగ్రి రంగాలపై సానుకూల వైఖరితో ఉన్నామని, ఆటో, కన్స్యూమర్ స్టేపుల్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీ రంగాలపై నెగిటివ్ దృక్పథంతో ఉన్నామని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సంస్థాగత పరిశోధనా విభాగం హెడ్ వరుణ్ లోచాబ్ చెప్పారు.