మంగోల్ రిఫైనరీకి మేఘా యంత్రాలు
ABN , Publish Date - Nov 22 , 2024 | 05:48 AM
స్థానిక మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) మరో ఘనత సాధించింది. మంగోలియాలో తొలిసారిగా నిర్మిస్తున్న మంగోల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టుకుఅవసరమైన కీలక యంత్ర పరికరాలను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్థానిక మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) మరో ఘనత సాధించింది. మంగోలియాలో తొలిసారిగా నిర్మిస్తున్న మంగోల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టుకుఅవసరమైన కీలక యంత్ర పరికరాలను సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఈ రిఫైనరీకి అవసరమైన ప్రెజర్ వెసల్‌ను పంపించింది. జీడిమెట్లలోని కంపెనీ ప్లాంటులో జరిగిన ఈ కార్యక్రమానికి మంగోల్ రిఫైనరీ సీఈఓ డాక్టర్ అల్టాంట్ సెట్‌సెగ్ డష్‌డవ, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) జనరల్ మేనేజర్ వికల్ప్ పలివాల్‌తో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టుకు చెందిన నాలుగు ప్యాకేజీల్లో మూడు ప్యాకేజీలను మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అమలు చేస్తోంది. కంపెనీ ఈ తరహా ప్రెజర్ వెసల్స్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి. ఈ అత్యాధునిక ప్రెజర్ వెసల్ తయారీ కోసం కంపెనీ ఉద్యోగులు ఎంతో నైపుణ్యం, నిబద్దతతో పని చేశారని ఎంఈఐఎల్ డైరెక్టర్ పీ దొరయ్య ఒక ప్రకటనలో తెలిపారు.