మిలియనీర్ల అడ్డా ముంబై, ఢిల్లీ
ABN , Publish Date - May 09 , 2024 | 05:39 AM
ప్రపంచంలో అత్యధికంగా మిలియనీర్లు నివసిస్తున్న 50 నగరాల జాబితాలో భారత్ నుంచి ముంబై, ఢిల్లీకి చోటు దక్కింది. ఈ ఏడాదికి గాను హెన్లీ అండ్ పార్టనర్స్ విడుదల చేసిన ప్రపంచ సంపన్న నగరాల నివేదికలో...
భారత్ నుంచి ఈ రెండింటికి చోటు
బెంగళూరులో సంపన్నుల సంఖ్య జూమ్
హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ జాబితా విడుదల
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధికంగా మిలియనీర్లు నివసిస్తున్న 50 నగరాల జాబితాలో భారత్ నుంచి ముంబై, ఢిల్లీకి చోటు దక్కింది. ఈ ఏడాదికి గాను హెన్లీ అండ్ పార్టనర్స్ విడుదల చేసిన ప్రపంచ సంపన్న నగరాల నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 58,800 మంది మిలియనీర్లతో ముంబై 24వ స్థానంలో నిలవగా.. 30,700 మంది మిలియనీర్లతో ఢిల్లీ 37వ స్థానంలో ఉంది. అమెరికన్ కరెన్సీలో కనీసం 10 లక్షల కోట్ల డాలర్ల (మన కరెన్సీలో రూ.8.35 కోట్లు) సంపద కలిగిన వారిని మిలియనీర్‌గా పిలుస్తారు. ముంబై సంపన్నుల్లో 236 మంది సెంటీ మిలియనీర్లు (కనీసం 100 మిలియన్ డాలర్లు= రూ.835 కోట్లు) కాగా, 29 మంది బిలియనీర్లుగా (కనీసం 100 కోట్ల డాలర్లు= రూ.8,350 కోట్లు) ఎదిగారు. ఢిల్లీ సంపన్నుల్లో 123 మంది సెంటీ మిలియనీర్లు, 16 మంది బిలియనీర్లు ఉన్నారు. భారత సిలికాన్ వేలీగా పేరొందిన బెంగళూరు మిలియనీర్ల సంఖ్య శరవేగంగా పెరుగుతున్న ప్రపంచ నగరాల్లో ఒకటిగా నిలిచింది. హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం బెంగళూరులో 13,200 మంది మిలియనీర్లు ఉన్నారు.
ప్రపంచంలో అత్యధిక మంది మిలియనీర్లున్న నగరాల్లో న్యూయార్క్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నగరంలో 3,49,500 మంది మిలియనీర్లున్నారు. ఈ నగర జనాభా 82.6 లక్షలు. అంటే, ప్రతి 24 మందిలో ఒకరు మిలియనీరే. గడిచిన దశాబ్దకాలంలో (2013-2023) న్యూయార్క్ సంపన్నుల సంఖ్య 48 శాతం పెరిగింది. అలాగే, పదేళ్లలో ముంబై మిలియనీర్ల సంఖ్య 82 శాతం వృద్ధి చెందగా.. ఢిల్లీలో 95 శాతం పెరిగింది.