Share News

మార్కెట్‌కు ‘చంద్ర’ కళ

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:25 AM

ఎన్‌డీఏలోనే కొనసాగడంతోపాటు కేంద్రం లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడం స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. దాంతో...

మార్కెట్‌కు ‘చంద్ర’ కళ

ఎన్‌డీఏకు బాబు భరోసాతో పోటెత్తిన కొనుగోళ్లు.. సెన్సెక్స్‌ 2,303 పాయింట్లు అప్‌

  • 736 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

  • హెరిటేజ్‌ ఫుడ్స్‌ 20 శాతం వృద్ధి

  • రూ.13.22 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: ఎన్‌డీఏలోనే కొనసాగడంతోపాటు కేంద్రం లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడం స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. దాంతో ఇన్వెస్టర్లు ఆందోళన వీడి హుషారుగా కొనుగోళ్లు జరపడంతో సూచీలు ఉవ్వెత్తున ఎగిశాయి. మూడు శాతానికి పైగా లాభపడి మంగళవారం నాటి నష్టాలను సగానికి పైగా పూడ్చుకోగలిగాయి. బుధవారం ట్రేడింగ్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 2,303.19 పా యింట్ల లాభంతో 74,382.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 735.85 పాయింట్ల లాభంతో 22,620.35 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్‌, ఆటో, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సహా పలు రంగాల షేర్లలో వేల్యూ బైయింగ్‌ జరగడం ఇందుకు దోహదపడింది. కొనుగోళ్ల జోరుతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఒక్కరోజులోనే రూ.13.22 లక్షల కోట్లు పెరిగి రూ.408.06 లక్షల కోట్లకు (4.89 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. మరిన్ని ముఖ్యాంశాలు..


  • సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీలూ లాభపడ్డాయి. బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్‌ సూచీ 4.41 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2.93 శాతం వృద్ధి చెందాయి. అన్ని రంగాల సూచీలూ పాజిటివ్‌గా ముగిశాయి.

  • స్టాక్‌ మార్కెట్లో ఒడుదుడులకు సంకేతమైన ఇండియా వీఐఎక్స్‌ సూచీ 29.39 శాతం తగ్గి 18.89 పాయింట్లకు జారుకుంది. మంగళవారం ఈ సూచీ 50 శాతం మేర పెరిగింది.

  • అదానీ గ్రూప్‌ కంపెనీలు పదింటిలో 9 కంపెనీల షేర్లు భారీగా పుంజుకుని మంగళవారం నాటి భారీ నష్టాలను పూడ్చుకున్నాయి. అదానీ గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.15.57 లక్షల కోట్లుగా నమోదైంది.


హెరిటేజ్‌, అమరరాజా, కేసీపీ షేర్లు జూమ్‌

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయంతో చంద్రబాబునాయుడు స్థాపించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేరు ఏకంగా 20 శాతం ఎగబాకి సరికొత్త ఏడాది గరిష్ఠ స్థాయి రూ.546.95 వద్దకు చేరుకుంది. వరుసగా గత మూడు సెషన్లలో ఈ షేరు దాదాపు 38 శాతం పెరిగింది. అలాగే, టీడీపీ మాజీ పార్లమెంట్‌ సభ్యుడు గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌ షేరు 12.27 శాతం వృద్ధితో రూ.1,216కు చేరుకుంది. ఏపీ రాజధానిగా అమరావతిని పునరుద్ధరిస్తామన్న చంద్రబాబు ప్రకటనతో ఈ ప్రాంతానికి దగ్గర్లో సిమెంట్‌ యూనిట్‌ కలిగిన కేసీపీ లిమిటెడ్‌ షేరు 19.55 శాతం ఎగబాకి రూ.201.80 వద్ద ముగిసింది.

Updated Date - Jun 06 , 2024 | 04:26 AM