కొత్త సంవత్సర వేడుకలు.. జీఎస్‌టీ..?
ABN , Publish Date - Dec 15 , 2024 | 02:19 AM
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఉత్సాహంగా జరుపుకునే వేడుక ఏదైనా ఉందంటే అది నూతన సంవత్సర వేడుక మాత్రమే. ముఖ్యంగా పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ...
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఉత్సాహంగా జరుపుకునే వేడుక ఏదైనా ఉందంటే అది నూతన సంవత్సర వేడుక మాత్రమే. ముఖ్యంగా పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విశ్వవ్యాప్తంగా డిసెంబరు 31 రాత్రి సంబరాలు జరుపుకోవటం పరిపాటి. ఈ వేడుకలు భారీ ఎత్తున నిర్వహించటానికి వివిధ హోటళ్లు, క్లబ్బులు, రిసార్టులు ఈ మధ్య కాలంలో విపరీతంగా పోటీపడుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో వివిధ రకాల వినోద కార్యక్రమాలతో ఈ వేడుకులను అట్టహాసంగా జరుపుతుంటారు. దీనికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీలను కూడా ఆయా సంస్థలు అందిస్తుంటాయి. ఉదాహరణకు ఒక రిసార్ట్ డిసెంబరు 31ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహిస్తుందనుకుందాం. దీనికి సంబంధించి ప్రవేశ రుసుము ఒక్కరికి రూ.5,000. టికెట్ తీసుకున్న వ్యక్తి ఆ ఈవెంట్‌కు సంబంధించిన వినోద కార్యక్రమాలు వీక్షించటతో పాటు ఆహార, పానీయాలు అంటే ఆల్కహాల్ కూడా పొందవచ్చు. అలాగే స్పెషల్ ఈవెంట్‌తో పాటు ఒక రోజు రిసార్ట్‌లో ఉండేటట్లు రూమ్‌తో కూడిన మరొక ప్యాకేజీ ఉంది. దీంతోపాటుగా తమ థీమ్ పార్క్ లేదా అమ్యూజ్‌మెంట్ పార్క్ సందర్శనతో కూడిన ఇంకొక ప్యాకేజీ రూపొందించింది. మరి ఈ ప్యాకేజీలకు జీఎ్‌సటీ ఎలా చెల్లించాలి?
ఇది అర్ధం చేసుకోవటానికి ముందుగా హోటల్స్‌లో లేదా రిసార్ట్స్‌లో పన్ను రేటు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. రూములకు జీఎ్‌సటీ అనేది 12 శాతం లేదా 18 శాతంగా వాటి విలువను బట్టి ఉంటుంది. ఒకరోజు అద్దె రూ.7,500 లేదా అంతకంటే తక్కువ ఉన్న వాటికి 12 శాతంగా, రూ.7,500కి పైన ఉన్న వాటికి 18 శాతంగా నిర్ణయించటం జరిగింది. అలాగే అక్కడి రెస్టారెంట్ సేవలకు హోటల్ టైపును బట్టి జీఎ్‌సటీ 5 శాతం, 18 శాతంగా నిర్ణయించటం జరిగింది. అలాగే ఈవెంట్స్‌కు వసూలు చేసే ప్రవేశ రుసుము మీద 18 శాతం జీఎ్‌సటీ చెల్లించాలి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, మామూలుగా అయితే రెస్టారెంట్ సర్వీ్‌సలలో ఆల్కహాల్ మీద జీఎ్‌సటీ వర్తించదు. బిల్లులో ఆల్కహాల్ మేర తగ్గించి మిగతా మొత్తం మీద జీఎ్‌సటీ చెల్లించాలి. మరి ఇప్పుడు ఈ డిసెంబరు 31 ప్రత్యేక ప్యాకేజీలో అన్ని కలిపి ఉంటాయి. మరి జీఎ్‌సటీ ఎలా లెక్కించాలి. అలాగే విలువలో లిక్కర్ మేరకు తగ్గించాలా లేదా అనేది సమస్య.
జీఎ్‌సటీ చట్టంలో మిక్స్‌డ్, కాంపోజిట్ సరఫరా అనే రెండు రకాల సరఫరాలు ఉంటాయి. కాంపోజిట్ సరఫరాలో ఒక ప్రధాన సరఫరా ఉంటుంది. దీనికి అనుబంధంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరఫరాలు ఉంటాయి. ఇవన్నీ సహజంగా కలిసి ఉంటాయి. ఉదాహరణకు ఏదేనీ బహుమతి కొన్నప్పుడు దానికి ఒక గిఫ్ట్ పేపర్ చుట్టటం, హోటల్‌లో రూమ్‌తో అల్పాహారం ఇవ్వటం, రైలు ప్రయాణంతో భోజనం కలిపి ఇవ్వటం. వీటిలో గిఫ్ట్, హోటల్ రూమ్, రైలు ప్రయాణం అనేవి ప్రధాన సరఫరా. ప్రధాన సరఫరాకు వర్తించే జీఎ్‌సటీ రేటు కాంపోజిట్ సరఫరాకు వర్తిస్తుంది. ఇక మిక్స్‌డ్ సరఫరాలో కూడా రెండు లేదా అంతకంటే ఎక్కువ సరఫరాలు ఉన్నా ఇందులో ఒక ప్రధాన సరఫరా అంటూ ఉండదు. అన్నీ విడివిడిగా అమ్మగలిగే విధంగా ఉన్నప్పటికీ సౌలభ్యం కోసం ఒకటే రుసుము వసూలు చేస్తారు. ఉదాహరణకు సూపర్ మార్కెట్లో వాషింగ్ పౌడర్, బకెట్ కలిపి లేదా టూత్‌పేస్టు, బ్రష్ కలిపి ఒక ప్యాకేజీగా ఇవ్వటం. నిజానికి ఇవన్నీ విడివిడిగా కూడా అమ్మవచ్చు. మిక్స్‌డ్ సరఫరాలో ఏ సరఫరాకు ఎక్కువ పన్ను రేటు ఉంటే అది మొత్తం బిల్లు మీద వర్తిస్తుంది. ఇక్కడ బకెట్, వాషింగ్ పౌడర్ లో లేదా పేస్టు, బ్రష్‌లలో దేనికి ఎక్కువ పన్ను రేటు ఉంటే అది మొత్తం బిల్లు మీద వర్తిస్తుంది.
ఈ విధంగా చూస్తే డిసెంబరు 31 ఈవెంట్ టికెట్‌లో ఈవెంట్ ప్రవేశం, ఆహార, పానీయాలు కలిపి ఉన్నా ప్రధాన సరఫరా ఈవెంట్ ప్రవేశం. అంటే ఇది కాంపోజిట్ సరఫరా. కాబట్టి ప్రధాన సరఫరా అయిన ఈవెంట్ టికెట్ మీద వర్తించే జీఎ్‌సటీ అంటే 18 శాతం మొత్తం టికెట్ విలువ మీద చెల్లించాలి. అలాగే వసతి, రెస్టారెంట్, అమ్యూజ్‌మెంట్ పార్క్ సందర్శన, ఈవెంట్ ప్రవేశం ఇలా అన్ని కలిపి ఉన్నప్పుడు ప్రధాన సరఫరా ఏది ఉందో చూడాలి. ప్రధాన సరఫరా లేకుండా అవన్నీ విడివిడి సరఫరాలుగా భావించినప్పుడు వీటన్నిటిలో ఎక్కువ పన్ను రేటు దేనికి ఉందో అది మొత్తం బిల్లు మీద చెల్లించాలి. అలా చూసినా 18 శాతం అనేది వీటన్నిటిలో అత్యధిక పన్ను రేటు కాబట్టి మొత్తం రుసుము మీద 18 శాతం చెల్లించాలి.
కాబట్టి ఇలా రెండు లేదా అంతకంటే ఎక్కువ సరఫరాలు ఉన్నప్పుడు అది కాంపోజిట్ సరఫరా కిందికి వస్తుందో లేదా మిక్స్‌డ్ సరఫరా కిందికి వస్తుందో చూసుకుని అందుకుతగ్గట్టుగా జీఎ్‌సటీ చెల్లించాలి.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.