డాక్టర్ రెడ్డీస్ చేతికి నికోటినెల్ బ్రాండ్
ABN , Publish Date - Jun 27 , 2024 | 05:40 AM
లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద కన్స్యూమర్ హెల్త్‌కేర్ కంపెనీ హేలియాన్ పీఎల్‌సీకి చెందిన నికోటినెల్ బ్రాండ్ డాక్టర్ రెడ్డీస్ చేతికి వచ్చింది. నికోటినెల్ బ్రాండ్‌తో పాటు ఇతర స్థానిక మార్కెట్లలో...
బ్రిటన్ కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
డీల్ విలువ రూ.5250 కోట్లు
హైదరాబాద్: లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద కన్స్యూమర్ హెల్త్‌కేర్ కంపెనీ హేలియాన్ పీఎల్‌సీకి చెందిన నికోటినెల్ బ్రాండ్ డాక్టర్ రెడ్డీస్ చేతికి వచ్చింది. నికోటినెల్ బ్రాండ్‌తో పాటు ఇతర స్థానిక మార్కెట్లలో దాని అనుబంధ బ్రాండ్లు నికాబెట్ (ఆస్ర్టేలియా), హాబిట్రాల్ (న్యూజిలాండ్, కెనడా), త్రైవ్ (కెనడా) హక్కులు కూడా డాక్టర్ రెడ్డీస్ చేతికి వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసులకు లోబడి నికోటిన్ రీప్లే్‌సమెంట్ థెరపీ (ఎన్‌ఆర్‌టీ) కింద ఈ ఔషధాలు వినియోగంలో ఉన్నాయి. ఈ బ్రాండ్లు చేజిక్కించుకునే ప్రక్రియలో భాగంగా హేలియాన్ గ్రూప్ కంపెనీ అయిన నార్త్ స్విట్జర్లాండ్ ఎస్‌ఏఆర్‌ఎల్ వాటాలను కొనుగోలు చేసేందుకు తమ అనుబంధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ ఎస్‌ఏ ఒక ఒప్పందంపై సంతకాలు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ డీల్ విలువ 50 కోట్ల పౌండ్లు (రూ.5250 కోట్లు). ఇందులో 45.8 కోట్ల పౌండ్లు రెండు సంవత్సరాల్లో (2025, 2026) నగదుగా చెల్లిస్తారు. రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఈ డీల్ ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి ఈ డీల్ ముగియవచ్చునని పేర్కొంది.
లావాదేవీ ముగియగానే అమెరికా వెలుపల జపాన్, లాటిన్ అమెరికా సహా సుమారు 30 మార్కెట్లలో ఆ ఔషధాలను డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేయగలుగుతుంది. ఎన్‌ఆర్‌టీ విభాగంలో ప్రపంచంలోనే (అమెరికా మినహా) అతి పెద్ద బ్రాండ్ నికోటినెల్ అని తెలిపింది. అలాగే యూర ప్‌లోని (రష్యా, ఇటలీ మినహా) 15 అతి పెద్ద ఓటీసీ బ్రాండ్లలో ఇదొకటి, ప్రపంచంలోని ఓటీసీ బ్రాండ్లలో 32వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కన్స్యూమర్ హెల్త్‌కేర్ రంగంలో డాక్టర్ రెడ్డీస్ ఇటీవల పరిధిని విస్తరించుకుంటూ వస్తోంది. నికోటినెల్ వ్యూహాత్మక కొనుగోలు ఆ విభాగంలో తమ స్థానాన్ని పటిష్ఠం చేస్తుందని డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ఎరెజ్ ఇజ్రాయెల్ అన్నారు. అయితే వ్యాపార అనుసంధానత విజయవంతంగా పూర్తి చేయడానికి వీలుగా దశలవారీ విధానం అనుసరించనున్నట్టు కంపెనీ తెలిపింది. కొవిడ్-19 సమయంలో పొగాకు వినియోగదారులు ఆ అలవాటు నుంచి బయటపడడం ద్వారా మహమ్మారి తీవ్రతను తగ్గించుకునేందుకు ఎన్‌ఆర్‌టీ ఔషధాలను వినియోగించారు.
పొగాకు కారణంగా ఏటా 80 లక్షల మంది వివిధ ప్రాణాంతక వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది పొగాకు వినియోగదారులున్నారని అంచనా. వారిలో 60 శాతం మంది ఆ అలవాటు నుంచి బయటపడాలని కోరుకుంటున్నప్పటికీ 30 మందికి మాత్రమే నివారణా మార్గాలు అందుబాటులో ఉంటున్నాయి. సరైన వైద్య చికిత్సలు అందించగలిగినట్టయితే వారు కూడా ఈ అలవాటు నుంచి బయటపడగలుగుతారన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం.