Share News

అదానీ చేతికి ఓరియెంట్‌ సిమెంట్‌

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:39 AM

సిమెంట్‌ రంగంలో టేకోవర్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా అదానీ గ్రూప్‌ కంపెనీ అంబుజా సిమెంట్‌.. సీకే బిర్లా గ్రూప్‌ కంపెనీ ‘ఓరియంట్‌ సిమెంట్‌’ను కొనుగోలు చేసింది. ఇందుకోసం ముందుగా ప్రమోటర్లు...

అదానీ చేతికి ఓరియెంట్‌ సిమెంట్‌

డీల్‌ విలువ రూ.8,100 కోట్లు.. ఒక్కో షేరుకు రూ.395.40 చొప్పున చెల్లింపు

న్యూఢిల్లీ: సిమెంట్‌ రంగంలో టేకోవర్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా అదానీ గ్రూప్‌ కంపెనీ అంబుజా సిమెంట్‌.. సీకే బిర్లా గ్రూప్‌ కంపెనీ ‘ఓరియంట్‌ సిమెంట్‌’ను కొనుగోలు చేసింది. ఇందుకోసం ముందుగా ప్రమోటర్లు సీకే బిర్లా, ఆయన కుటుంబ సభ్యుల చేతిలోని 46.8 శాతం ఈక్విటీ వాటాను ఒక్కో షేరుకు రూ.395.40 చొప్పున మొత్తం రూ.3,791 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మరో 26 శాతం వాటా కోసం త్వరలో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. ఈ కొనుగోలు కోసం అంబుజా సిమెంట్‌ మొత్తంగా రూ.8,100 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. ఇందుకు అవసరమైన నిధులను అదానీ గ్రూప్‌ పూర్తిగా అంతర్గత వనరుల ద్వారా సమీకరించనుంది.


85 లక్షల టన్నుల సామర్ధ్యం: ఓరియెంట్‌ సిమెంట్‌ కంపెనీకి ప్రస్తుతం 85 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో మూడు సిమెంట్‌ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో ఒక ప్లాంటు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా దేవాపూర్‌ వద్ద, మరో ప్లాంటు కర్ణాటక, గుల్బర్గా సమీపంలోని చిత్తాపూర్‌ వద్ద ఉన్నాయి. ఇంకో ప్లాంటు ఉత్తర భారత్‌లోని రాజస్థాన్‌లో ఉంది. ఇవికాకుండా ఓరియెంట్‌ సిమెంట్‌ మరో 81 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న సిమెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. కాగా ఓరియెంట్‌ సిమెంట్‌ టేకోవర్‌తో అంబుజా సిమెంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 9.74 కోట్ల టన్నులకు చేరనుంది. ఈ కొనుగోళ్లతో 2028 నాటికి సిమెంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్ధ్యాన్ని 14 కోట్ల టన్నులకు పెంచుకోవాలన్న లక్ష్యానికి దోహదం చేస్తాయని గ్రూప్‌ భావిస్తోంది.


ఈ ఏడాది రెండో కొనుగోలు: సిమెంట్‌ రంగంలో మార్కెట్‌ లీడర్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌ సిమెంట్‌ కంపెనీ అలా్ట్రటెక్‌తో పోటీపడాలన్నది అదానీ గ్రూప్‌ లక్ష్యం. ఇందులో భాగంగా గత ఏడాది డిసెంబరులో సంఘీ ఇండస్ట్రీ్‌సను రూ.5,185 కోట్లకు, ఈ ఏడాది జూన్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే పెన్నా సిమెంట్‌ను రూ.10,422 కోట్లకు అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఇదే సమయంలో అలా్ట్రటెక్‌ సిమెంట్‌ కంపెనీ దక్షిణ భారత మార్కెట్‌పై మంచి పట్టున్న ఇండియా సిమెంట్‌ కంపెనీని ఈ ఏడాది జూలైలో రూ.3,945 కోట్లకు కొనుగోలు చేసింది.

Updated Date - Oct 23 , 2024 | 12:39 AM