Mumbai: నాలుగు బ్యాంకులతో భాగస్వామ్యం కానున్న పేటీఎం.. ఎందుకంటే
ABN , Publish Date - Feb 26 , 2024 | 08:12 PM
ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడంతో నిషేధానికి గురైన పేటీఎం(Paytm Payments App)పేమెంట్స్ సంస్థ వేల కోట్ల నష్టాలు చవిచూస్తోంది. అదే సమయంలో వినియోగదారులు దూరమవుతుండటంతో దిద్దుబాటు చర్యలకు దిగింది.
ముంబై: ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడంతో నిషేధానికి గురైన పేటీఎం(Paytm Payments App)పేమెంట్స్ సంస్థ వేల కోట్ల నష్టాలు చవిచూస్తోంది. అదే సమయంలో వినియోగదారులు దూరమవుతుండటంతో దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా యూపీఐ లావాదేవీలు యథావిధిగా కొనసాగేందుకు నాలుగు ప్రముఖ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
యూపీఐ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, యస్ బ్యాంక్‌లతో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Paytm పేమెంట్స్ బ్యాంక్‌ని మార్చి 15లోపు తన వ్యాపారాన్ని ముగించాలని గతంలోనే సూచించింది. దీంతో పేటీఎం యాప్ యూజర్స్ పేమెంట్స్ ఆగిపోకుండా పేటీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూపీఐ అనేది ఆన్‌లైన్ చెల్లింపుల కోసం ఉపయోగపడే వ్యవస్థ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దీన్ని నిర్వహిస్తోంది.
వినియోగదారుల డబ్బును ఒక ఖాతా నుంచి మరోఖాతాకు బదిలీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. Paytm ముందుగా బ్యాంకింగ్ పార్టనర్‌గా యాక్సిస్ బ్యాంక్‌ని ఆన్‌బోర్డ్ చేసి, ఆపై మరిన్ని బ్యాంకులతో చేతులు కలిపే అవకాశం ఉంది. NPCI వెబ్‌సైట్ డేటా ప్రకారం.. Paytm దేశంలో UPI చెల్లింపుల కోసం ఉపయోగించే మూడో అతిపెద్ద యాప్. నెలకు 1.6 బిలియన్ లావాదేవీలు ఇందులో జరుగుతుంటాయి.
PhonePe, Google Pay యాప్‌లు రెండో స్థానంలో ఉన్నాయి. అయితే బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాక బ్యాంక్ సాంకేతికత, సంబంధిత మౌలిక సదుపాయాలను తనిఖీ చేయడానికి ఎన్‌పీసీఐకి సుమారు నెల సమయం పడుతుంది. పేటీఎం వినియోగదారులు అప్‌డేట్ అయిన పార్ట్‌నర్ బ్యాంక్ యూపీఐ హ్యాండిల్‌కి మారతారు. Paytmతో జరిపే ఏ వ్యాపారమైనా RBI ఆదేశాల ప్రకారమే జరుగుతుందని ఎస్ బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ అన్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.