ఏప్రిల్ నుంచి కాకినాడ ప్లాంట్‌లో పెన్సిలిన్ ఉత్పత్తి
ABN , Publish Date - Mar 15 , 2024 | 05:04 AM
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద అరబిందో ఫార్మా ఏర్పాటు చేస్తున్న పెన్సిలిన్ (పెన్-జీ) తయారీ ప్లాంటు ఉత్పత్తికి సిద్ధమవుతోంది. ‘వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో...
జూన్‌లోగా వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి షురూ
అరబిందో ఫార్మా వెల్లడి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద అరబిందో ఫార్మా ఏర్పాటు చేస్తున్న పెన్సిలిన్ (పెన్-జీ) తయారీ ప్లాంటు ఉత్పత్తికి సిద్ధమవుతోంది. ‘వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రక్రియను స్థిరీకరించే పనిలో ఉన్నాం’ అని కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ కే నిత్యానంద రెడ్డి తెలిపారు. ఈ ప్లాంటులో వచ్చే నెలలో ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభించి జూన్‌లోగా వాణిజ్య స్థాయిలో, రెండో త్రైమాసికానికల్లా పూర్తి స్థాయి ఉత్పత్తి అందుకోవాలని కంపెనీ అధికార వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
చైనా దిగుమతులకు చెక్!
ప్రస్తుతం కీలకమైన పెన్సిలిన్ ఉత్పత్తిలో చైనాదే గుత్తాధిపత్యం. కొవిడ్ తర్వాత ఆ దేశం నుంచి పెన్సిలిన్ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. దీనికి తోడు సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగితే చైనా మన దేశానికి పెన్సిలిన్ ఎగుమతులను కట్టడి చేసే ప్రమాదం ఉందని ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో చైనా పెన్సిలిన్ దిగుమతులకు చెక్ పెట్టేందుకు దేశీయంగా ఈ కీలక ఔషధ ముడి పదార్ధం తయారు చేసే కంపెనీలకు పీఎల్‌ఐ పథకం కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాలను దృష్టిలో ఉంచుకుని అరబిందో ఫార్మా కాకినాడ వద్ద రూ.2,400 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది.
60 శాతం సొంత అవసరాలకే
ఏటా 15,000 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్లాంటు ఉత్పత్తిలో 60 శాతం ఉత్పత్తిని అరబిందో ఫార్మా సొంత అవసరాలకు వాడుకోనుంది. మిగతా 40 శాతం ఉత్పత్తిని దేశీయ ఫార్మా కంపెనీలకు, విదేశాలకు ఎగుమతి చేస్తామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతానం సుబ్రమణియన్ చెప్పారు. చైనా కంపెనీలు అమ్మే ధరకే తమ పెన్సిలిన్ లభిస్తుందని కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ నిత్యానంద రెడ్డి తెలిపారు. ‘మా పోటీ చైనాతోనే. మా ఉత్పత్తి ధర చైనా కంపెనీలతో సమానంగా ఉంటుంది’ అన్నారు.