Share News

బ్యాంకింగ్‌, లోహ షేర్లలో కొనుగోళ్లు

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:23 AM

ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో మధ్యాహ్నం వరకు స్వల్ప లాభ, నష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ, ఆ తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 694.39 పాయింట్ల వృద్ధితో....

బ్యాంకింగ్‌, లోహ షేర్లలో కొనుగోళ్లు

ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో మధ్యాహ్నం వరకు స్వల్ప లాభ, నష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ, ఆ తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 694.39 పాయింట్ల వృద్ధితో 79,476.63 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 217.95 పాయింట్లు బలపడి 24,213.30 వద్ద ముగిసింది. ఆసియా, యూరప్‌ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు బ్యాంకింగ్‌, స్టీల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లలో వాల్యూ బైయింగ్‌ ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్‌ విశ్లేషకులు తెలిపారు. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 21 రాణించాయి. జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌ షేరు 4.72 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టాటా స్టీల్‌ 3.64 శాతం వృద్ధి చెందగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు 2 శాతానికి పైగా పెరిగాయి. బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాస్‌ సూచీలు 0.48 శాతం వరకు లాభపడగా.. రంగాలవారీ సూచీల్లో ఐటీ, టెక్‌, సర్వీసెస్‌ మినహా అన్నీ ఎగబాకాయి. మెటల్‌ 2.38 శాతం, బ్యాంకెక్స్‌ 2.09 శాతం పుంజుకోగా.. కమోడిటీస్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 1.84 శాతం వరకు పెరిగాయి.


స్విగ్గీ ఐపీఓ నేటి నుంచే..

  • ఇష్యూ ధరల శ్రేణి రూ.371-390

  • రూ.11,327 కోట్ల సమీకరణ లక్ష్యం

న్యూఢిల్లీ: ఫుడ్‌ డెలివరీతో పాటు క్విక్‌ కామర్స్‌ సేవలందించే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగియనుంది. ఐపీఓలో షేర్ల విక్రయ ధరల శ్రేణిని కంపెనీ రూ.371-390గా నిర్ణయించింది. పబ్లిక్‌ ఆఫరింగ్‌లో భాగంగా కంపెనీ రూ.4,499 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్లకు చెందిన రూ.6,828 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిన విక్రయించనుంది. అంటే ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.11,327 కోట్లు సమీకరించనుంది. గరిష్ఠ ధర శ్రేణి ప్రకారంగా కంపెనీ 1,130 కోట్ల డాలర్ల (దాదాపు రూ.95,000 కోట్లు) మార్కెట్‌ విలువను ఆశిస్తోంది. స్విగ్గీ ప్రధాన ప్రత్యర్థి జొమాటో 2021 జూలైలోనే ఐపీఓకు వచ్చింది. ప్రస్తుతం జొమాటో మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) రూ.2.14 లక్షల కోట్ల స్థాయికి చేరింది.

Updated Date - Nov 06 , 2024 | 01:23 AM