రష్యాతో రిలయన్స్ భారీ డీల్ !
ABN , Publish Date - Dec 13 , 2024 | 02:35 AM
భారత-రష్యా ఇంధన బంధం మరింత బలపడుతోంది. గుజరాత్ జామ్‌నగర్‌లోని తన రిఫైనరీకి రష్యా నుంచి పదేళ్ల పాటు రోజుకు ఐదు లక్షల బ్యారళ్ల చమురు దిగుమతి చేసుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)...
రోజుకు 5 లక్షల బ్యారళ్ల చమురు దిగుమతికి ఒప్పందం
న్యూఢిల్లీ: భారత-రష్యా ఇంధన బంధం మరింత బలపడుతోంది. గుజరాత్ జామ్‌నగర్‌లోని తన రిఫైనరీకి రష్యా నుంచి పదేళ్ల పాటు రోజుకు ఐదు లక్షల బ్యారళ్ల చమురు దిగుమతి చేసుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్).. రష్యా ప్రభుత్వ నిర్వహణలోని రాస్‌నె్‌ఫ్టతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఇది ఏటా 1,300 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.10 లక్షల కోట్లు)కు సమానం. దుబాయ్ క్రూడ్ కంటే మూడు డాలర్ల డిస్కౌంట్‌తో రష్యా ఈ చమురు సరఫరా చేయనుంది. అవసరమైతే ఈ ఒప్పందాన్ని మరో పదేళ్ల పాటు పొడిగించుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈ ఒప్పందంపై రెండు కంపెనీలు ఇంకా అధికారికంగా నోరు మెదపడం లేదు. తన చమురు దిగుమతులపై యూరోపియన్ యూనియన్ (ఈయూ), అమెరికా ఆంక్షల నేపథ్యంలో రాస్‌నెఫ్ట్, రిలయన్స్ ఇండస్ట్రీ్‌సతో ఈ దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.
కాగా రిలయన్స్ గతంలో రాస్‌నె్‌ఫ్టతో ఏడాది కాలపరిమితితో రోజుకు 3 లక్షల బ్యారళ్ల చమురు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం రిలయన్స్ జామ్‌నగర్‌లో పూర్తిగా ఎగుమతుల కోసమే రోజుకు 5.8 లక్షల బ్యారళ్ల సామర్థ్యం గల రిఫైనరీని నిర్వహిస్తోంది. దేశీయ అవసరాల కోసం రోజుకు 6.6 లక్షల బ్యారళ్ల సామర్థ్యంతో మరో రిఫైనరీని కూడా నిర్వహిస్తోంది.