వృద్ధి క్షీణతకు రెపో కారణం కాదు
ABN , Publish Date - Dec 11 , 2024 | 05:45 AM
వృద్ధి రేటు మందగించడానికి అధిక రెపో రేట్లే కారణం కాదని, అందుకు ఎన్నో అంశాలు దోహదపడ్డాయని పదవీ విరమణ చేస్తున్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. మంగళవారం ఆర్‌బీఐ గవర్నర్ హోదాలో చివరి పత్రికా సమావేశంలో...
వృద్ధి క్షీణతకు రెపో కారణం కాదు
ఆర్‌బీఐ గవర్నర్ దాస్
ముంబై: వృద్ధి రేటు మందగించడానికి అధిక రెపో రేట్లే కారణం కాదని, అందుకు ఎన్నో అంశాలు దోహదపడ్డాయని పదవీ విరమణ చేస్తున్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. మంగళవారం ఆర్‌బీఐ గవర్నర్ హోదాలో చివరి పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వృద్ధి, ద్రవ్యోల్బణం మధ్య సమతూకం సాధించడమే ఆర్‌బీఐ ముందున్న ప్రధాన సవాల్ అని చెప్పారు. దాస్ నాయకత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) వరుసగా 11 విడతలుగా రెపో రేట్లను యథాతథగా కొనసాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ చర్యలను ఆయన సమర్థించుకుంటూ ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని అందుకనుగుణంగా ద్రవ్య విధానాన్ని ఉంచేందుకే కృషి చేశామన్నారు. రేట్ల నిర్ణయం అనే అంశాన్ని అంత తేలికైన విషయంగా తీసుకోవద్దని ఆయన కోరారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని బలంగా నిలిచిందంటూ కొత్తగా ఆర్‌బీఐ పగ్గాలు చేపడుతున్న సంజయ్ మల్హోత్రా కూడా విస్తృత అనుభవం గల వ్యక్తి అని, ఆర్‌బీఐని సమర్థవంతంగా ముందుకు నడుపుతారని తెలిపారు.
ఆర్థిక శాఖతో
సత్సంబంధాలే...
తన హయాంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంబంధాలు అత్యుత్తమంగా ఉన్నాయని దాస్ అన్నారు. అనేక అంశాలపై కేంద్ర బ్యాంక్, ఆర్థిక శాఖ మధ్య భిన్న వైఖరులుంటాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉందని ఆయన చెప్పారు. అయితే తన హయాంలో అలాంటి సమస్యలేవైనా ఉంటే అంతర్గత చర్చల ద్వారా పరిష్కరించుకోగలిగామన్నారు. తమ మధ్య చక్కని సహకారం, సమన్వయం నెలకొన్నాయని ఆయన తెలిపారు. 2018లో తాను అధికార బాధ్యతలు చేపట్టిన సమయంలో వృత్తిపరమైన విలువలు, విశ్వసనీయత, స్వయంప్రతిపత్తి పరిరక్షించేందుకు తాను కృషి చేస్తానని చెప్పానని, అందుకు అనుగుణంగానే పని చేశానని శక్తికాంత దాస్ అన్నారు.
అన్నీ అర్ధం చేసుకుని పని చేస్తా ..
సంజయ్ మల్హోత్రా
తాను ఆర్థిక వ్యవస్థకు చెందిన అన్ని కోణాలను పూర్తిగా అర్ధం చేసుకుని ఆర్థిక వ్యవస్థకు ఏది మంచిదైతే అలా పని చేస్తానని ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా చెప్పారు. బుధవారం బాధ్యతలు చేపట్టనున్న మల్హోత్రా ఆర్థిక శాఖ కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయి 6.21 శాతానికి దూసుకుపోయి వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి క్షీణించిన కీలక దశలో ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా పగ్గాలు చేపడుతున్నారు.
ఫిబ్రవరి పాలసీలో రేట్ల తగ్గింపు
కొత్త ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రా హయాంలో ఫిబ్రవరిలో జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తొలి విడత రేట్ల కోత ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మల్హోత్రా సారథ్యంలో ఆర్‌బీఐ సరళతర ద్రవ్య విధానాన్ని అనుసరించే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు జపాన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ నోమురా అంటోంది. కొత్త గవర్నర్ ఆర్థిక శాఖ నుంచి రావడం వల్ల రాబోయే కాలంలో రేట్ల నిర్ణయంలో ప్రభుత్వం శక్తివంతమైన పాత్ర పోషించవచ్చని స్విస్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ అంచనా వేస్తోంది. రాబోయే ఎంపీసీ సమావేశం నాటికి ద్రవ్యోల్బణ ఒత్తిడులు తగ్గి రెపో రేటు ఒక మోస్తరుగా తగ్గించే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు ఎస్ అండ్ పీ అంటోంది. ఏది ఏమైనా ఫిబ్రవరి నుంచి ప్రారంభించి రెపో రేటును 0.75 శాతం వరకు తగ్గించే ఆస్కారం ఉన్నట్టు పలువురు అంచనా వేస్తున్నారు.