Share News

2030 నాటికి రూ.3.38 లక్షల కోట్లు

ABN , Publish Date - Nov 24 , 2024 | 01:46 AM

దేశంలోని ప్రధాన నగరాల్లో క్విక్‌ కామర్స్‌ సేవలకు గిరాకీ వేగంగా పెరుగుతోంది. వినియోగదారులు తమ ఇంటి దగ్గర్లోని కిరాణా దుకాణానికి వెళ్లి తెచ్చుకోగలిగేంత తక్కువ సమయంలోనే...

2030 నాటికి రూ.3.38 లక్షల కోట్లు

భారత క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌పై దాతుమ్‌ ఇంటెలిజెన్స్‌ అంచనా

న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాల్లో క్విక్‌ కామర్స్‌ సేవలకు గిరాకీ వేగంగా పెరుగుతోంది. వినియోగదారులు తమ ఇంటి దగ్గర్లోని కిరాణా దుకాణానికి వెళ్లి తెచ్చుకోగలిగేంత తక్కువ సమయంలోనే క్విక్‌ కామర్స్‌ కంపెనీలు ఆ సరుకులను ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నాయి. పైగా డిస్కౌంట్లూ ఆఫర్‌ చేస్తున్నాయి. దాంతో క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఆర్డర్‌ చేసే కస్టమర్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూపోతోంది. 2024లో 610 కోట్ల డాలర్ల (రూ.51,484 కోట్లు) స్థాయికి చేరనున్న దేశీయ క్విక్‌కామర్స్‌ మార్కెట్‌.. 2030 నాటికి 4,000 కోట్ల డాలర్ల (రూ.3.38 లక్షల కోట్లు) స్థాయికి పెరగవచ్చని దాతుమ్‌ ఇంటెలిజెన్స్‌ తాజా నివేదిక అంచనా వేసింది. క్విక్‌ కామర్స్‌ కంపెనీలు ఇప్పటికే సంప్రదాయ కిరాణా షాపులకు చెందిన దాదాపు సగం విక్రయాలను చేజిక్కించుకోగలిగాయని రిపోర్టు పేర్కొంది. కిరాణా షాపుల నుంచి కొనుగోళ్లు తగ్గించామని కంపెనీ సర్వేలో పాల్గొన్న 46 శాతం మంది వెల్లడించారు.


దేశీయ క్విక్‌ కామర్స్‌ రంగంలో బ్లింకిట్‌, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ మినట్స్‌ ప్రముఖ కంపెనీలుగా ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌ కస్టమర్లకు 10-30 నిమిషాల్లో ఇంటివద్దకే సరుకుల డెలివరీ అందిస్తున్నాయి. తొలుత నిత్యావసర, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను మాత్రమే ఆఫర్‌ చేసిన ఈ ప్లాట్‌ఫామ్స్‌.. ఈ మధ్య కాలంలో ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను ఎలకా్ట్రనిక్స్‌, ఫ్యాషన్‌, కాస్మెటిక్స్‌, దుస్తులు, జువెలరీ, బుక్స్‌, క్రీడల ఉత్పత్తులు, ఔషధాలు, మాంసాహారోత్పత్తులు సహా పలు విభాగాలకు విస్తరించాయి. ఈ ఏడాదిలో 128 కోట్ల డాలర్ల విలువైన కిరాణా షాపుల విక్రయాలను క్విక్‌ కామర్స్‌ వేదికలు చేజిక్కించుకోనున్నాయని అంచనా. ఇది ఆ ప్లాట్‌ఫామ్స్‌ మొత్తం విక్రయాల్లో 21 శాతంగా ఉండనుందని రిపోర్టు పేర్కొంది. ఈ ఏడాది క్విక్‌ కామర్స్‌ సేవలు 74 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా.

2023-28 మధ్య కాలంలో ఈ మార్కెట్‌ 48 శాతం సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌)తో దూసుకెళ్లనుందని నివేదిక పేర్కొంది.


2 లక్షల కిరాణా స్టోర్ల మూత : ఏఐసీపీడీఎఫ్‌

దేశంలో క్విక్‌ కామర్స్‌ సంస్థల సేవల శరవేగ వ్యాప్తి సంప్రదాయ కిరాణా దుకాణాల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్విక్‌ కామర్స్‌ దెబ్బకు గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల కిరాణా స్టోర్లు మూతపడ్డాయని ది ఆల్‌ ఇండియా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐసీపీడీఎఫ్‌) ప్రకటించింది. దేశంలో దాదాపు 1.3 కోట్ల కిరాణా దుకాణాలున్నాయని అంచనా. అందులో కోటికి పైగా ద్వితీయ శ్రేణి, చిన్న నగరాలు, పట్టణాల్లో ఉన్నాయి. క్విక్‌ కామర్స్‌ సేవలు ప్రధానంగా మెట్రో నగరాల్లోని కిరాణా దుకాణాల వ్యాపారంపై అధిక ప్రభావం చూపుతున్నాయని.. గత ఏడాది కాలంలో మెట్రో సిటీల్లోని 90,000 స్టోర్లు మూతపడ్డాయని ఏఐసీపీడీఎఫ్‌ అంటోంది. ప్రథమ శ్రేణి నగరాల్లో 60,000.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మరో 50,000 దుకాణాలను కట్టేశారని తెలిపింది. క్విక్‌ కామర్స్‌ సంస్థల భారీ డిస్కౌంట్లు, అనుచిత వ్యాపార విధానాలు సంప్రదాయ కిరాణా దుకాణాల సంఖ్యతో పాటు వాటి కస్టమర్లు, లాభాలకూ గండికొడుతున్నాయని, వాటి మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయని ఏఐసీపీడీఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్‌ పాటిల్‌ అన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 01:46 AM